దులీప్ ట్రోఫీ–2026పై బీసీసీఐ కీలక నిర్ణయం.. ఫైనల్‌ ఎక్కడ?

  • దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు కొత్త మైదానం..
  • బీసీసీఐ పరిశీలనలో ప్రత్యామ్నాయాలు

న్యూఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ : దేశవాళీ క్రికెట్‌ సీజన్‌కు తెరలేపనున్న ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ–2026 నిర్వహణపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీఓఈ)లో జరగాల్సిన టోర్నీ ఫైనల్‌ను మరో వేదికకు తరలించే అంశాన్ని బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఆగస్టు 23 నుండి సెప్టెంబర్ 6 వరకు జరగనున్న ఈ టోర్నమెంట్‌లో ఆరు జట్లు టైటిల్ కోసం పోటీపడనున్నాయి. మొత్తం ఐదు మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నమెంట్ కోసం బెంగళూరులోని COE వేదికగా ఎంపికైంది. అయితే, ఆ వేదిక వద్ద ప్రేక్షకులను అనుమతించడంపై ఉన్న ప్రభుత్వ ఆంక్షల కారణంగా, ఫైనల్ మ్యాచ్‌ను పూర్తి స్థాయి స్టేడియంలో నిర్వహించాలని BCCI పరిశీలిస్తోంది.

బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా మాట్లాడుతూ.. సీఓఈ ప్రాంగణంలో ప్రేక్షకులను అనుమతించేందుకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. భద్రతా కారణాలతో అక్కడ భారీ సంఖ్యలో అభిమానులను అనుమతించే అవకాశం లేదని స్పష్టం చేశారు.

ప్రేక్షకులు లేకుండా నిర్వహణపై ?

ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఖాళీ స్టేడియంలో జరగడం అభిమానులకు నిరాశ కలిగించే అంశమని క్రికెట్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో కనీసం ఫైనల్‌ మ్యాచ్‌నైనా ప్రేక్షకుల సమక్షంలో నిర్వహించే అవకాశం ఉందా అనే దానిపై బీసీసీఐ దృష్టి సారించింది. “సీఓఈలో ప్రేక్షకులను అనుమతించలేని పరిస్థితి ఉంది. ఇది ప్రభుత్వ నిబంధనలకు సంబంధించిన విషయం. దానిని ఉల్లంఘించలేం. ఫైనల్‌ను మరో స్టేడియంలో నిర్వహించే అవకాశాన్ని పరిశీలిస్తాం” అని దేవజిత్‌ సైకియా తెలిపారు.

మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాలపై దృష్టి

గత సీజన్‌లో డులీప్‌ ట్రోఫీ మ్యాచ్‌లకు ప్రత్యక్ష ప్రసారం పరిమితంగా ఉండగా.. ఈసారి ఎక్కువ మ్యాచ్‌లను టెలికాస్ట్‌ చేసేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల ప్రదర్శనలను వీక్షించే అవకాశం కల్పించడమే లక్ష్యమని బీసీసీఐ కార్యదర్శి తెలిపారు. అయితే ప్రస్తుతం మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం చేయడంతో పాటు అదే సమయంలో ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతించే అంశాన్ని పరిశీలించడం లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కొత్త దేశవాళీ క్రికెట్‌ సీజన్‌కు నాంది పలికే డులీప్‌ ట్రోఫీపై ఈసారి మరింత ఆసక్తి నెలకొంది. యువ ఆటగాళ్లతో పాటు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న క్రికెటర్లకు ఈ టోర్నీ కీలక వేదికగా మారనుంది.