చిట్యాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
చిట్యాల, ఆంధ్రప్రభ : మండలంలోని ప్రజలు ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకునిఅపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చిట్యాల ఎస్ఐ పోచంపల్లి సతీష్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లోకి ఎవరైనా కొత్త వ్యక్తులు , అపరిచితులు, అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపిస్తే, స్థానిక పోలీసులకు సమాచారం అందించాలన్నారు.
వారితో మాట్లాడేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో చాలామంది రాత్రి వేళల్లో ఇంటి ముందు లేదా ఆరుబయట నిద్రిస్తుంటారు. మహిళలు బయట పడుకునే సమయంలో ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని కోరారు.
మార్కెట్‌లో బంగారం ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో, దొంగలు నివాస ప్రాంతాలపై కన్నేసే అవకాశం ఉంది. కావున మీ విలువైన బంగారు నగలను, నగదును సురక్షితమైన ప్రదేశాల్లో భద్రపరుచుకోవాలనీ కోరారు.
ఎవరైనా అనుమానితులు కనిపిస్తే , ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉందనిపిస్తే భయపడకుండా ,వెంటనే డయల్ 100 కి గానీ లేదా స్థానిక ఎస్.ఐ. 8712658124 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని కోరారు. మండల ప్రజలు జాగ్రత్తలు తీసుకుంటూ, దొంగతనాల నియంత్రణకు పోలీసు వారితో సహకరించాలని ఎస్సై సతీష్ కోరారు.
