ప్రైవేట్ స్కూళ్లకు ఎంఈఓ వార్నింగ్..
చౌటుప్పల్, ఆంధ్రప్రభ: చౌటుప్పల్ మండలంలోని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, కరస్పాండెంట్లు, ప్రధానోపాధ్యాయులు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, లేనిపక్షంలో పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని మండల విద్యాధికారి (ఎంఈఓ) గురువారావు హెచ్చరించారు. ఈ మేరకు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలకు ఆయన అధికారిక నోటీసు జారీ చేశారు.
పాఠశాలల సక్రమ నిర్వహణకు మున్సిపాలిటీ లేదా గ్రామపంచాయతీ నుంచి నిరాక్షేపణ పత్రం (ఎన్ఓసీ), భవన పటిష్టత ధ్రువీకరణ పత్రం, అగ్నిమాపక శాఖ అనుమతి, పారిశుధ్య ధ్రువీకరణ పత్రం, ట్రాఫిక్ పోలీస్ శాఖ నుంచి ఎన్ఓసీ తప్పనిసరిగా ఉండాలని నోటీసులో పేర్కొన్నారు.
ఒకటి కంటే ఎక్కువ బ్రాంచీలు నిర్వహిస్తున్న పాఠశాలలు ప్రభుత్వ ప్రత్యేక అనుమతి పొందాలని, పాఠశాల పరిధిలో ఆటస్థలం ఉండాలని, విద్యార్థులను రవాణా చేసే బస్సులకు ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. అలాగే పాఠశాల గుర్తింపు గడువు ముగిసిన వెంటనే రెన్యువల్ చేయించుకోవాలని, భవనానికి సంబంధించిన పత్రాలు, లీజ్ డాక్యుమెంట్లు సక్రమంగా ఉండాలని స్పష్టం చేశారు.
పాఠశాలల ప్రాంగణంలో టెక్స్ట్‌బుక్స్, నోట్‌బుక్స్, షూస్, టైలు, బెల్టులు, ఇతర స్టేషనరీ సామగ్రి విక్రయించరాదని పేర్కొన్నారు. వీటితో పాటు అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు, నిబంధనలు పాటించాల్సిందేనని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అవసరమైన అనుమతులు లేకపోయినా, పాఠశాలల గుర్తింపును రద్దు చేయడంతో పాటు సీజ్ చేస్తామని నోటీసు ద్వారా హెచ్చరించారు.
