నాణ్యమైన విద్యకు తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకం

: డీఈఓ రాజేందర్

చిట్యాల, ఆంధ్రప్రభ: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య, నైపుణ్యాధారిత బోధన, సమర్థులైన ఉపాధ్యాయులు, ఆధునిక బోధనా విధానాలు అందుబాటులో ఉన్నాయని, విద్యార్థుల అభివృద్ధికి తల్లిదండ్రుల భాగస్వామ్యం కీలకమని భూపాలపల్లి జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ అన్నారు.

శనివారం చిట్యాల మండలంలోని జూకల్లు ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు గిరగాని కృష్ణ అధ్యక్షతన తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి రమేష్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా డీఈఓ రాజేందర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు అవసరమైన సౌకర్యాలు, నైపుణ్యాధారిత బోధన విధానాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు పంపించాలని సూచించారు.

పిల్లల విద్యాభివృద్ధిలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, ఇంటి వద్ద పిల్లల చదువును పర్యవేక్షించడం, ఉపాధ్యాయులతో తరచూ సంప్రదింపులు జరపడం, విద్యార్థుల హాజరు, అభ్యాసం, క్రమశిక్షణపై దృష్టి పెట్టాలని కోరారు.

తల్లిదండ్రులు నెలకు కనీసం ఒకసారి పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులతో మాట్లాడితే విద్యార్థుల అభివృద్ధికి మరింత సహకారం అందుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎలగొండ సంధ్యారాణి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.