Telangana Farmers News | సాగునీటి కోసం వికారాబాద్ రైతుల నిరీక్షణ

Telangana Farmers News | సాగునీటి కోసం వికారాబాద్ రైతుల నిరీక్షణ

Telangana Farmers News | పాలమూరు ఎత్తిపోతలపై పెరుగుతున్న సందేహాలు
ప్రాణహిత పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ హామీలు
కాలువల పనులు నిలిచిపోవడంపై విమర్శలు
పాలమూరు కోసం ఉద్యమిస్తామంటున్న బీఆర్ఎస్

Telangana Farmers News | వికారాబాద్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మూసీ, కాగ్నా, కాక్రవేణి జీవనదులు ప్రవహిస్తున్న జిల్లాలోని వ్యవసాయ భూములకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది. దశాబ్దాలుగా చిన్న నీటి వనరులు, బోరుబావులు, వర్షాలపైనే ఆధారపడి రైతులు సాగు చేస్తున్నారు. సాగునీటి కోసం అనేక పోరాటాలు జరిగాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కీలకంగా పనిచేసిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు జరిగి పుష్కర కాలం గడుస్తోంది. నేటికీ జిల్లాకు ఎక్కడి నుంచి సాగునీరు ఇస్తారు అనేది అస్పష్టంగా మారింది.

వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. అయినా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతాలకు సాగునీటిని అందించే విషయంలో తీవ్ర వివక్ష కొనసాగుతోందన్న విమర్శలు ఉన్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కృష్ణా నది నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇస్తామని పనులను ప్రారంభించి కొంత మేరకు పూర్తి చేసింది.

తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉమ్మడి జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల పథకం కాకుండా ప్రాణహిత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు ఇస్తామని చెబుతోంది. గతవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్‌లో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. వచ్చే ఏడాదిన్నరలో కొడంగల్ నియోజకవర్గంలోని 1.50 లక్షల ఎకరాలకు కృష్ణా నది నీటిని పారిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రకటనతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి ప్రాంతంలోని 3.50 లక్షల ఎకరాలకు సాగునీరు ఎక్కడి నుంచి అందిస్తారు అనే ప్రశ్నలు ప్రారంభమయ్యాయి.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వికారాబాద్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం కింద నాలుగు నియోజకవర్గాల్లో 3.41 లక్షల ఎకరాలకు సాగునీరు, 417 గ్రామాలకు తాగునీటిని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఉద్దండాపూర్ జలాశయం నుంచి కాలువల ద్వారా జిల్లాలోని భూములకు, గ్రామాలకు సాగు, తాగునీటిని అందించాలని నిర్ణయించారు.

ఉద్దండాపూర్ జలాశయం పనులు 80 శాతం వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశారు. ఉద్దండాపూర్ జలాశయం కింద కాలువల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 5,180 కోట్లను విడుదల చేసింది. కాలువల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియను కూడా ప్రారంభించారు. 2023లో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలువల టెండర్లను పక్కన పెట్టింది. కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంతో వికారాబాద్ జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు వచ్చే అవకాశం లేకుండాపోయింది.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రాణహిత-చేవెళ్ల ఎత్తిపోతల పథకం ద్వారా వికారాబాద్ జిల్లాలోని భూములకు సాగునీరు అందిస్తామని చెబుతోంది. ఈ ఎత్తిపోతల పథకంలో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం చెబుతోంది. మరి వికారాబాద్ జిల్లాకు ఎక్కడి నుంచి సాగునీరు అందిస్తారు అనేదానికి సమాధానం లేదు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో దివంగత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జిల్లాకు ప్రాణహిత ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు అందిస్తామని చెప్పి తుమ్మిడిహెట్టి ప్రధాన బ్యారేజీ నిర్మాణం చేయకుండా చేవెళ్ల ప్రాంతంలో కొంత కాలువల నిర్మాణ పనులను చేపట్టారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత పథకం పట్టాలెక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాణహితను పూర్తిగా పక్కన పెట్టింది. జిల్లాకు పాలమూరు ఎత్తిపోతల ద్వారా సాగునీరు ఇస్తామని చెప్పి పనులను ప్రారంభించారు. తాజాగా ప్రభుత్వం ప్రాణహిత ఎత్తిపోతల ద్వారానే సాగునీరు అంటూ చెప్పడం గమనార్హం.

పాలమూరు కోసం ఉద్యమిస్తాం

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారానే జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సాగు, తాగునీటిని అందించాలి. ఈ పథకం ద్వారానే కొడంగల్‌కు కూడా సాగునీటిని అందించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి కేవలం స్వార్థం కోసం కొడంగల్-నారాయణపేట్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారు. ఈ ప్రాజెక్టు కింద కొడంగల్‌కు సాగునీటిని ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. జిల్లాలోని ఇతర ప్రాంతాలకు పాలమూరు ఎత్తిపోతల ద్వారానే సాగునీటిని అందించాలి. ఇందుకోసం జిల్లాలోని ప్రజలు, రైతులతో కలిసి ఉద్యమిస్తాం. ప్రాణహిత ఎత్తిపోతల ద్వారా జిల్లాకు సాగునీరు మరో వందేళ్లు అయినా రావు. జిల్లా ప్రజలను, రైతులను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు ప్రాణహిత పాట పాడుతున్నారు.

డాక్టర్ ఆనంద్ (బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు)

Leave a Reply