Telangana Tourism News | అధికారుల మౌనంపై అనుమానాలు

Telangana Tourism News | అధికారుల మౌనంపై అనుమానాలు
Telangana Tourism News | నాగార్జునసాగర్ టూరిజంలో భారీ అక్రమాల ఆరోపణలు
నకిలీ టికెట్లు, డీజిల్ చోరీపై విమర్శలు
మౌనం వహిస్తున్న టూరిజం అధికారులు
విచారణ పేరుతో కాలయాపన?
పర్యాటక శాఖ పనితీరుపై ప్రశ్నలు
Telangana Tourism News | హైదరాబాద్, ఆంధ్రప్రభ: పర్యాటక శాఖలో అడపాదడపా అక్రమాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎందుకోగానీ అధికారులు మౌనం పాటిస్తున్నారు. నాగార్జునసాగర్ పర్యాటక శాఖలో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తి రెండు నెలలు గడుస్తున్నా ఉన్నతాధికారుల్లో కనీస స్పందన కనిపించడం లేదు. నకిలీ టికెట్ల దందా, డీజిల్ చోరీ, అక్రమ వసూళ్లపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చినప్పటికీ.. టూరిజం కార్పొరేషన్‌లోని ఎండీ నుంచి ఈడీ, విజిలెన్స్ విభాగం గానీ, వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ గానీ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయకపోవడం గమనార్హం. దీంతో విచారణ పేరుతో కాలయాపన చేస్తూ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని కాపాడే ప్రయత్నం జరుగుతోందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు నెలల కిందట సాగర్ బోటింగ్‌లో జరుగుతున్న అక్రమాలపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అప్పట్లో టూరిజం కార్పొరేషన్‌లోని వాటర్ ఫ్లీట్ జీఎంతో పాటు ఇతర అధికారులు ప్రకటించారు. కానీ, నేటికీ విచారణ ఏ దశలో ఉంది? ఆరోపణల్లో నిజమెంత? బాధ్యులపై ఏం చర్యలు తీసుకున్నారు? అనే విషయాలపై పర్యాటక శాఖ నుంచి కనీస స్పందన లేదు. ముఖ్యంగా టూరిజం విజిలెన్స్ అధికారులు, వాటర్ ఫ్లీట్ విభాగం మౌనం వహించడం అధికారుల పనితీరుకు అద్దం పడుతోంది.

ఇవీ… ఆరోపణలు
నాగార్జునసాగర్‌లో బోటింగ్ విభాగానికి సంబంధించిన పలు దిగ్భ్రాంతికరమైన ఆరోపణలు వినిపించాయి. ఇంచార్జ్ అధికారిక రశీదులకు బదులుగా, సొంతంగా నకిలీ ఎంఆర్ పుస్తకాలు ముద్రించి టికెట్లు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రతి 100 మంది పర్యాటకులు వస్తే అందులో సుమారు 30 మందికి టికెట్లు ఇవ్వకుండానే బోట్లలోకి అనుమతిస్తూ ఆ నగదును సిబ్బంది పంచుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక ట్రిప్పుకు అయ్యే డీజిల్ కంటే అదనంగా 2 లీటర్లు ఖర్చయినట్లు చూపిస్తూ ఇంధనం పేరుతో దొంగతనం చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. పది ట్రిప్పులు తిరిగితే రికార్డుల్లో కేవలం ఎనిమిది మాత్రమే చూపిస్తూ.. రెండు ట్రిప్పుల ఆదాయాన్ని స్వాహా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి.
ఇన్ని ఆరోపణలున్నా నేటి వరకు ఎలాంటి విచారణ చేసినట్లు టూరిజం కార్పొరేషన్ అధికారులు ఒక్క ప్రకటన కూడా విడుదల చేసిన పాపాన పోలేదు. ఈ అక్రమాల్లో కార్పొరేషన్‌లోని ఉన్నతాధికారుల హస్తం ఏమైనా ఉందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
విచారణ పేరుతో కంటి తుడుపు చర్యలు
రాష్ట్రంలో పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతున్నా, ఆదాయం మాత్రం ఆ స్థాయిలో పెరగకపోగా తిరోగమనంలో ఉండటం పర్యాటక శాఖ పనితీరుపై సందేహాలను కలిగిస్తోంది. సంవత్సరాల తరబడి ఒకే చోట తిష్టవేసిన అధికారుల అండదండలతోనే ఈ అక్రమాలు సాగుతున్నాయని, అందుకే విచారణల పేరుతో కంటితుడుపు చర్యలు చేపడుతున్నారని పర్యాటకులు భావిస్తున్నారు.
విచారణ కమిటీలు వేయడం, నివేదికలు కోరడం వంటి పాత పద్ధతులతో కాలం వెళ్లదీస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో ప్రక్షాళన జరగడం లేదు. క్షేత్రస్థాయిలో విచారణ చేసిన దాఖలాలు కూడా కనిపించడం లేదు. ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే విచారణ చేస్తామనే చెబుతున్నారు తప్ప చర్యలు తీసుకోవట్లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే టూరిజం కార్పొరేషన్లో కిందిస్థాయి అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాట అన్న చందంగా తయారైంది.
