Operation Sindoor 2.0 | డ్రోన్ శిక్షణపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Operation Sindoor 2.0 | డ్రోన్ శిక్షణపై ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
Operation Sindoor 2.0 | రెచ్చగొట్టే చర్యలకు భారత్ ప్రతిస్పందనే
త్రివిధ దళాల సమన్వయంపై దృష్టి
భవిష్యత్ యుద్ధాలకు సైన్యం సిద్ధం
Operation Sindoor 2.0 | న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. తాత్కాలికంగా ఘర్షణలు ఆగిపోయాయని, ఒకవేళ ఆపరేషన్ సిందూర్ 2.0 జరిగితే దాని కోసం దేశ త్రివిధ దళాలు పూర్తిగా సన్నద్ధమవుతున్నాయని వెల్లడించారు. రెచ్చగొట్టే చర్యలకు భారత్ ఇచ్చే ప్రతిస్పందనను ఆపరేషన్ సిందూర్ నిర్వచించిందని అన్నారు. ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.
మహారాష్ట్రలోని ఖడక్వాస్లాలోని ఎన్డీఏలో జరిగిన 150వ కోర్సు పాసింగ్ అవుట్ పరేడ్‌కు ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము త్రివిధ దళాల మధ్య సమన్వయాన్ని పెంచుకోవడం, తదుపరి యుద్ధానికి సన్నద్ధం కావడంపై దృష్టి సారిస్తున్నామని చెప్పారు. యుద్ధభూమి 24 గంటలూ పారదర్శకంగా ఉంటుందని, ప్రతి కదలిక అవతలి వారికి తెలిసిపోతుందని అన్నారు. అందువల్ల దళాల మోహరింపు, వినియోగం, సరిహద్దు ప్రాంతాల్లోని సైనికులు, పౌరులను రక్షించడానికి అవసరమైన రక్షణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
రెచ్చగొట్టే చర్యలకు భారత్ ప్రతిస్పందనే
ఆపరేషన్ సిందూర్ ఇంకా కొనసాగుతోందని, తాత్కాలికంగా ఘర్షణలే ఆగాయని ఆర్మీ చీఫ్ స్పష్టం చేశారు. భవిష్యత్‌లో భూమి, గాలి, సముద్రంలోనే కాకుండా అంతరిక్షం, సైబర్, విద్యుదయస్కాంత రంగాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయని తెలిపారు.

నేటి యుద్ధాలు కేవలం సరిహద్దుల నుంచే రావని జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. ఆపరేషన్ సిందూర్ దేశ సంకల్పాన్ని, క్రమబద్ధమైన, కచ్చితమైన, ప్రయోజనాత్మకమైన ప్రతిస్పందనను అందించడంలో సాయుధ దళాల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని చెప్పారు. ఈ ఆపరేషన్ సమీకృత ప్రణాళిక, రియల్ టైమ్ ఇంటెలిజెన్స్, కచ్చితమైన లక్ష్య నిర్దేశం, పటిష్టమైన రక్షణ, సురక్షితమైన కమ్యూనికేషన్లు, వివిధ రంగాల మధ్య సమన్వయం ప్రాముఖ్యతను తెలియజేసిందని పేర్కొన్నారు.
భవిష్యత్ సంఘర్షణలు కేవలం సంప్రదాయ యుద్ధభూములకే పరిమితం కావని ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అభిప్రాయపడ్డారు. భూమి, గాలి, సముద్రం, అంతరిక్షం, సైబర్, విద్యుదయస్కాంత రంగాల్లో కూడా యుద్ధాలు జరుగుతాయన్నారు. ఈ మార్పుల పట్ల భారత సైన్యానికి పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేశారు. పరివర్తన దశాబ్దంలో భాగంగా తాము భవిష్యత్తుకు సిద్ధంగా ఉండే శక్తిగా రూపాంతరం చెందుతున్నామని వెల్లడించారు. ఇందులో యువతరం పాత్ర కీలకమని అభిప్రాయపడ్డారు.
ప్రతి జవాన్‌కు డ్రోన్ నడపడం తెలిసి ఉండాలని, అందుకు సంబంధించిన శిక్షణ అకాడమీలలో, ట్రైనింగ్ సెంటర్లలో ఇస్తారని తెలిపారు. తాను గతేడాది డిసెంబర్‌లో ఎన్డీఏకి వచ్చినప్పుడు ఆర్మీ శిక్షణా బృందానికి వ్యక్తిగతంగా 4-6 పెద్ద డ్రోన్లు, సిమ్యులేటర్లను అందించానని గుర్తుచేసుకున్నారు. ఎందుకంటే క్యాడెట్లు ఇక్కడి నుంచి యుద్ధభూమికి వెళ్లినప్పుడు అక్కడ చాలా డ్రోన్లు ఉంటాయని, ఈ నైపుణ్యం నేర్చుకోకపోతే వాటిని అర్థం చేసుకోవడం వారికి చాలా కష్టమవుతుందని అన్నారు.
