ధాన్యం కొనుగోళ్లకు దిక్కు లేదు.. బీఆర్‌ఎస్‌పై విమర్శలా?

ధాన్యం కొనుగోళ్లకు దిక్కు లేదు.. బీఆర్‌ఎస్‌పై విమర్శలా?

  • ఎంపీ చామలపై యాకూబ్ రెడ్డి ఆగ్రహం

మోత్కూర్, ఆంధ్రప్రభ:
యాసంగి కాలం ముగిసి వానాకాలం వస్తున్నప్పటికీ ధాన్యం కొనుగోళ్లపై ఏమాత్రం శ్రద్ధ చూపని కాంగ్రెస్ ప్రభుత్వం, రైతుల పక్షాన పోరాడుతున్న బీఆర్‌ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మోత్కూర్ మాజీ మార్కెట్ చైర్మన్ కోనతం యాకూబ్ రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకపక్క మార్కెట్ యార్డులు, ఐకేపీ, సింగిల్ విండో కేంద్రాలలో కొనుగోళ్లు సాగక ధాన్యం కుప్పలు పేరుకుపోయి మూలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మరోపక్క విపరీతమైన ఎండలకు రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే అరిగోస పడుతుంటే వారి కష్టాలు తీర్చాల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం అర్థరహితమన్నారు.

ధాన్యపు గింజలు అమ్ముడుపోక రైతులు నష్టపోకుండా తక్షణమే ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి డిమాండ్ చేయడం జరిగిందన్నారు. దీనిపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ జగదీశ్వర్ రెడ్డిని ‘గుంటకండ్ల కాదు గుంటనక్క’ అంటూ వ్యక్తిగత విమర్శలకు దిగడం సరైన పద్ధతి కాదన్నారు. తమ పార్టీ ముఖ్య నాయకుడిని విమర్శిస్తే తాము కూడా చామల కిరణ్‌ను ‘సన్యాసి కిరణ్ కుమార్ రెడ్డి’ అని విమర్శించగలమని హెచ్చరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత అయిన జగదీశ్వర్ రెడ్డిని తక్కువ చేసి మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు.

ప్రభుత్వానికి నిజంగా వడ్లు సక్రమంగా కొనుగోలు చేస్తున్నామన్న నమ్మకం ఉంటే భువనగిరి నియోజకవర్గ పరిధిలోని ఏదైనా ఒక మార్కెట్ లేదా ఐకేపీ సెంటర్ లో పూర్తిస్థాయిలో వడ్లు కొనుగోలు చేశామని నిరూపించగలరా అని ఎంపీ చామలకు సవాల్ విసిరారు. కాంగ్రెస్ పాలనలో వడ్ల కొనుగోలుపై కనీస ఆలోచన లేదని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లు యజమానులు క్వింటాలుకు ఏకంగా 4 నుండి 5 కిలోల వరకు తరుగు పేరిట కట్ చేస్తున్నారని ఆరోపించారు. లారీ యజమానులు సైతం ఒక్కో లారీకి 500 రూపాయల నుండి 1500 రూపాయల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. వీటిపై ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించి రైతులను ఆదుకోవాల్సిన పాలకులు, అన్నదాతలకు అండగా ఉంటున్న ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం ముమ్మాటికీ చేతగానితనమేనని యాకూబ్ రెడ్డి దుయ్యబట్టారు.

ధాన్యం కొనుగోళ్లకు దిక్కు లేదు.. బీఆర్‌ఎస్‌పై విమర్శలా?

Leave a Reply