ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఫార్మసిస్టుల ఆగ్రహం..

ఆన్‌లైన్ మందుల విక్రయాలపై ఫార్మసిస్టుల ఆగ్రహం..

ఐఓసీడ్ పిలుపుతో విజయవాడలో మెడికల్ షాపుల బంద్..
ఎన్టీఆర్ జిల్లా అసోసియేషన్ల నిరసన ర్యాలీ..
కోవిడ్ కాలం జీఓ రద్దు చేయాలని డిమాండ్..

విజయవాడ, ఆంధ్రప్రభ : ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలకు చెందిన మెడికల్ షాపుల అసోసియేషన్లు బంద్‌లో పాల్గొన్నారు. విజయవాడలో నిర్వహించిన భారీ నిరసన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ఫార్మసిస్టులు, మెడికల్ షాప్ యాజమానులు పాల్గొని తమ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా కెమిస్టులు, డ్రగ్గిస్టులు అసోసియేషన్ అధ్యక్షుడు సాధు ప్రసాద్ మాట్లాడుతూ.. కోవిడ్ సమయంలో ఆన్‌లైన్ మెడిసిన్ విక్రయాలకు ప్రభుత్వం తాత్కాలికంగా జీఓ జారీ చేసిందని, పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ ఆ జీఓను ఇప్పటికీ రద్దు చేయకపోవడం తీవ్ర ఇబ్బందులకు దారితీస్తోందన్నారు.

ముఖ్యంగా సైకియాట్రిక్ మందులు కూడా ఆన్‌లైన్ ద్వారా విక్రయించబడటం ఆందోళనకర పరిణామమని పేర్కొన్నారు. రీటైల్ కెమిస్టులు, డ్రగ్గిస్టులు అసోసియేషన్ అధ్యక్షుడు సాయి మాట్లాడుతూ.. ఆన్‌లైన్ మందుల విక్రయాల ద్వారా డిస్కౌంట్లు లభిస్తున్నప్పటికీ, వైద్యుల సలహా లేకుండా ప్రజలు వాడకూడని మందులను వినియోగించే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ దృష్ట్యా ఆన్‌లైన్ మందుల అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కోవిడ్ సమయంలో జారీ చేసిన జీఓను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విజయవాడ నగరంలో సుమారు 650 మెడికల్ షాపులు ఉన్నాయని, బంద్ జరుగుతున్నప్పటికీ అత్యవసర అవసరాల కోసం కొన్ని మెడికల్ షాపులను అందుబాటులో ఉంచుతున్నామని తెలిపారు. రోగులు ఇబ్బందులు పడకూడదనే బాధ్యతతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు.

Leave a Reply