Cricket | ఇక వన్డే సమరం…
- నేటి నుంచి భారత్, సౌతాఫ్రికా వన్డే సిరీస్ షురూ
- అందరి దృష్టి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పైనే
- రాంచీ వేదికగా మధ్యాహ్నం 1.30కి తొలి వన్డే
- స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
Cricket | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టెస్టు సిరీస్ ముగియండంతో నేటి నుంచి వన్డే సిరీస్‌కు తెరలేవనుంది. మూడు మ్యాచుల సిరీస్‌లో భాగంగా ఇవాళ తొలి వన్డే రాంచీ వేదికగా జరగనుంది. రోహిత్, కోహ్లీ రాకతో టీమిండియా బ్యాటింగ్ యూనిట్ పటిష్టంగా మారిపోయింది. ఇక టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన సౌతాఫ్రికా.. ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. రాంచీ వేదికగా మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే సొంతగడ్డపై సఫారీల చేతిలో టెస్టుల్లో వైట్‌వాష్ ఎదుర్కొన్న టీమ్ఇండియా..వన్డేల్లో ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్పిన్ ఉచ్చులో విలవిలలాడిన భారత్..రెండు టెస్టుల్లో ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నది.
కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయాలతో దూరం కావడంతో ఈ సిరీస్‌లో భారత జట్టును కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. ఇక గిల్ గైర్హాజరీలో తుది జట్టులోకి రానున్న యశస్వి జైశ్వాల్.. ఈ సిరీస్‌లో సత్తాచాటి.. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని చూస్తున్నాడు. సుదీర్ఘ విరామం తర్వాత ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన రోహిత్, కోహ్లీ మెరుగైన ప్రదర్శనే చేశారు. రోహిత్ ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ కొట్టగా.. విరాట్ హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చాడు. ఇక సొంతగడ్డపై జరుగుతున్న ఈ సిరీస్‌లో వారు పరుగుల వరద పారించాలని అభిమానులు కోరుకుంటున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ లాంటి సీనియర్లు అందుబాటులో లేకపోవడంతో యువ పేసర్లు అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాలు పేస్ భారాన్ని మోయనున్నారు. మరోవైపు టెస్ట్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు రబాడ, నోకియా గైర్హాజరీలోనూ సత్తాచాటేందుకు సఫారీలు ఆత్మవిశ్వాసంతో ఉన్నారు. ముఖ్యంగా కెప్టెన్ బవుమా, మార్క్రం, డికాక్, బ్రిట్జె, బ్రెవిస్‌తో బలంగా కనిపిస్తున్నది.
రాంచీలో పిచ్ ఎలా ఉందంటే?
రాంచీలో భారత్ ఐదు వన్డేలో ఆడింది. ఇందులో మూడింట్లో గెలిచి.. రెండిట్లో ఓడిపోయింది. రాంచి పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఇవాళ్టి మ్యాచులో కూడా స్కోరు 270-280 మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. పేసర్లతో పోలిస్తే.. ఇక్కడ స్పిన్నర్లు ఎక్కు ప్రభావం చూపిస్తారు. రాత్రి పూట మంచు ప్రభావం ఉండే అవకాశం ఉంది. దీంతో టాస్ గెలిచిన జట్టు.. తొలుత ఛేజింగ్‌కే మొగ్గు చూపొచ్చు.
తుది జట్లు అంచనా..
భారత్: యశస్వి జైశ్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్/ రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ
దక్షిణాఫ్రికా: మార్క్రమ్, క్వింటన్ డికాక్, టెంబా బవూమా (కెప్టెన్), బ్రీట్జ్ కే, డివాల్డ్ బ్రెవిస్, రుబిన్ హెర్మన్, మార్కో జాన్సెన్, బోష్, కేశవ్ మహారాజ్, బర్గర్, లుంగీ ఎంగిడి

