కామన్వెల్త్‌లో భారత్ జోరు

  • తొలి ప్రయత్నంలోనే ఫైనల్‌కు మురళీ శ్రీశంకర్
  • నాలుగు పతకాలతో పట్టికలో ఎనిమిదో స్థానం

ఆంధ్రప్రభ : కామన్వెల్త్ క్రీడల్లో భారత స్టార్ లాంగ్‌జంపర్ మురళీ శ్రీశంకర్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫయింగ్ రౌండ్‌లో ఎనిమిది మీటర్ల మార్కును అధిగమించాల్సి ఉండగా, తొలి ప్రయత్నంలోనే 8.01 మీటర్ల జంప్‌తో లక్ష్యాన్ని చేరుకున్నాడు మురళీ శ్రీశంకర్. ఈ విజ‌యంతో ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకున్నాడు.

27 ఏళ్ల శ్రీశంకర్ పురుషుల లాంగ్‌జంప్ క్వాలిఫయింగ్ గ్రూప్-ఏలో తొలి అథ్లెట్‌గా బరిలోకి దిగాడు. మొదటి ప్రయత్నంలోనే అర్హత మార్కును దాటడంతో గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. జమైకాకు చెందిన జోర్డాన్ టర్నర్ 7.80 మీటర్ల జంప్‌తో రెండో స్థానంలో నిలిచాడు. అర్హత మార్కును అందుకోలేకపోయి ఉంటే రెండు గ్రూపుల పోటీలు ముగిసిన తర్వాత తొలి 12 స్థానాల్లో నిలవాల్సి వచ్చేది. అయితే తొలి ప్రయత్నంలోనే అర్హత సాధించడంతో శ్రీశంకర్ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఫైనల్‌కు చేరుకున్నాడు.

2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో శ్రీశంకర్ లాంగ్‌జంప్‌లో రజత పతకం గెలిచాడు. అప్పట్లో కూడా క్వాలిఫయింగ్‌లో 8.05 మీటర్లతో అగ్రస్థానంలో నిలిచిన ఆయన, ఫైనల్లో 8.08 మీటర్లు దూకి రజతంతో సరిపెట్టుకున్నాడు. ఈసారి గ్లాస్గోలో స్వర్ణ పతకాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. పురుషుల లాంగ్‌జంప్ ఫైనల్ జూలై 29న జరగనుంది.

ఎనిమిద‌వ స్థానంలో ఇండియా..

మ‌రోవైపు కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత జట్టు శుభారంభం చేసింది. ఇప్పటివరకు ఒక స్వర్ణం, రెండు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తం నాలుగు పతకాలు సాధించిన భార‌త్… పతకాల పట్టికలో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.

భారత్‌కు తొలి స్వర్ణ పతకాన్ని మహిళల 48 కిలోల వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను అందించింది. రికార్డు స్థాయి ప్రదర్శనతో ఆమె బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. పురుషుల 60 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో రిషికాంత్ సింగ్ రజత పతకం గెలుచుకోగా, 65 కిలోల విభాగంలో రాజా ముత్తుపాండి మరో రజతాన్ని భారత్ ఖాతాలో జమ చేశాడు.

అంతకుముందు పురుషుల పారా పవర్‌లిఫ్టింగ్ విభాగంలో జండూ కుమార్ కాంస్య పతకం సాధించి కామన్వెల్త్ క్రీడల్లో భారత్ పతకాల ఖాతాను తెరిచాడు. ప్రస్తుతం వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు పతకాలు, పారా పవర్‌లిఫ్టింగ్‌లో ఒక పతకంతో భారత్ మొత్తం నాలుగు పతకాలు సాధించింది. జూలై 23న ప్రారంభమైన ఈ క్రీడలు ఆగస్టు 2 వరకు కొనసాగనున్నాయి.

పతకాల పట్టికలో ఆస్ట్రేలియా 17 స్వర్ణాలు, 9 రజతాలు, 13 కాంస్యాలతో మొత్తం 39 పతకాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లండ్ రెండో, స్కాట్లాండ్ మూడో స్థానాల్లో ఉండగా.. భారత్ ఎనిమిదో స్థానంలో నిలిచింది.