వికారాబాద్‌లో అధికారికంగా వాసవి మాత జయంతోత్సవాలు
వికారాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న వాసవి మాత జయంతి ఉత్సవాలను ఆదివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వైశాఖ శుక్ల పక్ష దశమి నాడు వాసవి మాత జయంతిని రాష్ట్ర కార్యక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఈ వేడుకలు నిర్వహించబడ్డాయి.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఉమాశంకర్ ప్రసాద్ జ్యోతి ప్రజ్వలన చేసి, వాసవి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో క్రీడల అభివృద్ధి అధికారి సత్తార్, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాలే లక్ష్మణ్, వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
