NTR Bharosa Pensions | 2025లో స్వర్ణ యుగం

NTR Bharosa Pensions | 2025లో స్వర్ణ యుగం

  • సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాం
  • సంక్షేమంతో పాటు అభివృద్ధి చేస్తున్నాం
  • 18 నెలల్లో పింఛన్లకు రూ.50 వేల కోట్లు
  • మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడి

NTR Bharosa Pensions | కోటబొమ్మాళి, ఆంధ్రప్రభ : 2025వ సంవత్సరం రాష్ట్రంలో స్వర్ణయుగమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. కోటబొమ్మాలి మేజర్ పంచాయతీ పరిధి ప్రకాష్ నగర్ కాలనీలో ఇవాళ‌ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేశారు. నందిగాం మండలం దీనబంధుపురం పంచాయతీ పరిధిలో 2020 వ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి అప్పటి ప్రభుత్వం తొలగించిన తొమ్మిది మంది పింఛన్ల లబ్ధిదారులు కోర్టును ఆశ్రయించగా వారంతా అర్హులేనని తేల్చిన కోర్టు అప్పటి నుంచి పాత బకాయిలతో సహా చెల్లించామని ఆదేశించడంతో ఒక్కొక్కరికి రూ.200,750లు చొప్పున మంత్రి చేతుల మీదుగా అందజేశారు.

ఈసందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ… ఎన్నికల హామీలుగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలు చేస్తూ సంక్షేమంతో పాటు అభివృద్ధిని సమపాళ్ల‌లో చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో చిన్నాభిన్నమైన పాలనను ఎన్డీఏ ప్రభుత్వం గాడిలో పెడుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం సహకారం అందించడంతో అభివృద్ధి, సంక్షేమం పరుగులు తీస్తోందని మంత్రి తెలిపారు. దేశ చరిత్రలోనే సువర్ణ అధ్యాయంగా 18 నెలల్లోనే రూ.50వేల కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు అందజేసినట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వంలో మౌలిక సదుపాయాలకు నోచుకోని గ్రామాలకు సౌకర్యాలు కల్పిస్తున్న ట్లు చెప్పారు.

NTR Bharosa Pensions

ఒక్క కోటబొమ్మాలి గ్రామంలోనే కేవలం18 నెలల్లో 59 రోడ్లకు రూ.7 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. రాష్ట్రంలోనే టెక్కలి నియోజకవర్గం ఆదర్శంగా నిలపాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు ప్రభుత్వం ప్రారంభిస్తుందని తెలిపారు. కోటబొమ్మాలి అన్న క్యాంటీన్లో రెండు పూటలా ఆహారం అందిస్తుండగా అవసరం మేరకు రాత్రిపూట కూడా ఆహారం అందించడానికి యోచిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో రైతులకు అన్యాయం చేసిందని దీన్ని సరి చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం అష్ట కష్టాలు పడుతుందని తెలిపారు. వీటిని సరిచేయడానికి ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ముఖ్యమంత్రి తెలిపారని అచ్చెన్నాయుడు చెప్పారు. 22 ఏ భూ సమస్యల పరిష్కారానికే ఇటీవల జిల్లా కేంద్రంలో ప్రత్యేక సదస్సు నిర్వహించి 500మందికి పరిష్కారం చూపినట్లు మంత్రి తెలిపారు. ఎన్నో ఏళ్ల క్రితం ప్రకాష్ నగర్ కాలనీలో లబ్ధిదారులకు అందజేసిన ఇళ్ల స్థల పట్టాలు ప్రస్తుతం నివాసం ఉంటున్న వ్యక్తులు వేరువేరుగా ఉన్నందున అసలైన లబ్ధిదారుల పేరున మార్చడానికి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు మంత్రి తెలిపారు.

గత ప్రభుత్వం కొత్త జిల్లాల పేరుతో ఇష్టం వచ్చినట్లుగా విడగొట్టిందని, దీంతో ప్రజల్లో సమస్యలు తలెత్తాయని, వాటిని సరిచేయడానికి పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా గతంలో పలాస డివిజన్ లోకి మార్చిన నందిగాం మండలాన్ని తిరిగి టెక్కలి డివిజన్ లోకి తీసుకువచ్చామని చెప్పారు. రాష్ట్రంలో రాయచోటిని అన్నమయ్య మదనపల్లిగా మార్చినట్లు చెప్పారు. దీనిపై తప్పు చేసిన వైసీపీ నాయకులే ఇప్పుడు టీడీపీపై విమర్శలు చేస్తున్నారని, దీనిని ప్రజలు తిప్పికొట్టాలన్నారు. మరో రెండు సంవత్సరాలలో టెక్కలి అంటే జిల్లా కేంద్రానికి తలదన్నేలా అభివృద్ధి పరుస్తానని మంత్రి తెలిపారు. త్వరలో కోటబొమ్మాలికి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను తీసుకుని వస్తానని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కృషితో భోగాపురం విమానాశ్రయం పనులు పూర్తయ్యాయని, జనవరి 4న మొదటిసారిగా రామ్మోహన్ నాయుడు విమానంలో భోగాపురానికి వస్తున్నారని మంత్రి తెలిపారు.

ఇల్లు, ఇంటి స్థలం లేని పేదలు దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందుకు సంబంధించి స్థ‌లం అందుబాటులో ఉందని చెప్పారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీవో కృష్ణమూర్తి, తహసీల్దార్ ఆర్.అప్పలరాజు, ఎంపీడీవో కే.ఫణింద్ర కుమార్, పిఎసిఎస్ మాజీ అధ్యక్షుడు కే.హరి వరప్రసాద్, కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ బోయిన గోవిందరాజులు, మండల టీడీపీ అధ్యక్షుడు బోయిన రమేష్, పీఏసీఎస్ అధ్యక్షురాలు వి.విజయలక్ష్మి, మాజీ ఎంపీపీ తర్ర‌ రామకృష్ణ, మాజీ జెడ్పిటిసి సభ్యులు ఎన్.శ్రీనివాసరావు, బి.వెంకట రమణమ్మ, కల్లి లక్ష్మణ, రెడ్డి నాగయ్య రెడ్డి, డి.సింహాద్రమ్మ‌, కె.గోవిందరావు, తదితరులు పాల్గొన్నారు.