స్వర్ణ ఆంధ్ర విజన్‌తో గ్రామీణాభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే కూన రవికుమార్
ఆమదాలవలస, ఆంధ్రప్రభ: స్వర్ణ ఆంధ్ర విజన్ ద్వారా గ్రామీణ ఉపాధి, సంప్రదాయ చేతివృత్తులు, కుటీర పరిశ్రమల అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఏర్పడతాయని ఆమదాలవలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ అన్నారు. ఢిల్లీలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడిని ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బుర్ల రామాంజనేయులు, బండారు శ్రావణి కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణ ఆంధ్ర విజన్‌పై విస్తృతంగా చర్చించినట్లు కూన రవికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాలను చేతివృత్తులు, సంప్రదాయ కళలు, కుటీర పరిశ్రమలకు కేంద్రాలుగా అభివృద్ధి చేయడం, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, స్థానిక కళాకారులకు మార్కెట్ విస్తరణ, మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక సాధికారత వంటి అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నట్లు వెల్లడించారు.
రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం కీలకమని, స్వర్ణ ఆంధ్ర విజన్ గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతికి కొత్త దిశను చూపుతుందని సమావేశంలో అభిప్రాయపడినట్లు కూన రవికుమార్ తెలిపారు.
