New Zealand | కేన్ విలియమ్సన్‌కు రీప్లేస్‌మెంట్ ఖరారు..

New Zealand | కేన్ విలియమ్సన్‌కు రీప్లేస్‌మెంట్ ఖరారు..

ఆంధ్రప్రభ: అంతర్జాతీయ క్రికెట్‌కు న్యూజిలాండ్ దిగ్గజ బ్యాటర్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు ప్రకటించి అభిమానులకు హార్ట్‌బ్రేక్ చేసిన‌ సంగతి తెలిసిందే. 16 ఏళ్లకు పైగా కొనసాగిన అద్భుత కెరీర్‌కు ముగింపు పలికిన కేన్, ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ మధ్యలోనే జట్టుకు దూరమయ్యాడు.

ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడిని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కేన్ విలియమ్సన్ స్థానంలో టాప్ ఆర్డర్ బ్యాటర్ విల్ యంగ్‌ను జట్టులోకి ఎంపిక చేసినట్లు అధికారికంగా వెల్లడించింది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో మిగిలిన రెండు మ్యాచ్‌ల కోసం అతడిని ఎంపిక చేశారు.

విలియమ్సన్ వైదొలగడంతో అతని స్థానాన్ని భర్తీ చేసే బాధ్యత విల్ యంగ్‌పై పడింది. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గా ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో అనుభవం ఉన్న విల్ యంగ్‌ను రెండో టెస్టుకు ముందు జట్టుతో కలవాలని న్యూజిలాండ్ క్రికెట్ సూచించింది. ఈ మేరకు న్యూజిలాండ్ క్రికెట్ విడుదల చేసిన ప్రకటనలో, “విల్ యంగ్‌కు స్వాగతం. రెండో టెస్టు కోసం సన్నాహకాలు కొనసాగుతున్న వేళ అతడు రేపు జట్టుతో చేరనున్నాడు” అని పేర్కొంది.

జూన్ 17 నుంచి రెండో టెస్టు..

ఇంగ్లండ్‌తో రెండో టెస్టు జూన్ 17 నుంచి ప్రారంభం కానుంది. విలియమ్సన్ లాంటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయడం సవాల్ అయినప్పటికీ, విల్ యంగ్ తన అనుభవంతో జట్టుకు ఉపయోగపడతాడని న్యూజిలాండ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. న్యూజిలాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచిన కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్ తర్వాత జట్టులో జరిగిన తొలి ప్రధాన మార్పు ఇదే. ఇప్పటికే అభిమానులు, మాజీ క్రికెటర్లు విలియమ్సన్ సేవలను కొనియాడుతుండగా, ఇప్పుడు అతని స్థానంలో వచ్చిన విల్ యంగ్‌పై అందరి దృష్టి నిలిచింది.