ప్రజావాణి నిర్వహణలో నిర్లక్ష్యం..
తాడ్వాయి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు సమయపాలన పాటించకపోవడం స్థానిక ప్రజల్లో అసంతృప్తిని రేకెత్తించింది. ఉదయం 11 గంటలు 10 నిమిషాలు గడిచినా సంబంధిత అధికారులు హాజరు కాలేదు. ప్రతి సోమవారం ప్రజా సమస్యలు స్వీకరించి పరిష్కరించాలన్న జిల్లా అధికారుల స్పష్టమైన ఆదేశాలున్నప్పటికీ తహసిల్ కార్యాలయ స్థాయిలో సమయపాలన లోపించినట్లు కనిపించింది.
ప్రజావాణి ప్రారంభమైనప్పటికీ ఇన్‌చార్జి డిప్యూటీ తహసిల్దార్ మాత్రమే అందుబాటులో ఉండడం విశేషంగా నిలిచింది. వివిధ శాఖల అధికారులు ఆలస్యంగా రావడంతో తమ సమస్యలు పరిష్కారం కాకపోవచ్చన్న భావనతో పలువురు బాధితులు మండల కేంద్రం కాకుండా జిల్లా కలెక్టర్ ప్రజావాణికి వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మార్వో సెలవులో ఉండడం, ఇతర శాఖల అధికారుల రాకలో ఆలస్యం కారణమని ఇన్‌చార్జి డిప్యూటీ తహసిల్దార్ బిక్షపతి తెలిపారు. అయితే ప్రజావాణిలో అధికారులు సమయపాలన పాటించకపోవడం వల్ల తమ సమస్యలను ఎవరికి చెప్పాలో తెలియక ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
