Neeraj Chopra | రికార్డులు, రివార్డుల కోసం ఆ ప‌ని చేయ‌ను…

ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : స్పోర్ట్స్ లో త్వరగా విజయాలు సాధించాలనే ఆలోచనతో డోపింగ్ వైపు వెళ్లొద్దని భారత స్టార్ జావెలిన్ త్రోయర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత నీరజ్ చోప్రా యువ క్రీడాకారులకు సూచించారు. డోపింగ్ వల్ల తాత్కాలిక ప్రయోజనం కనిపించినా, కెరీర్ మొత్తాన్ని నాశనం చేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారత క్రీడల్లో డోపింగ్ నిర్మూలన కోసం నీరజ్ చోప్రా ఫౌండేషన్, Indian Olympic Association (ఐఓఏ) కలిసి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

ఈ సందర్భంగా విడుదల చేసిన వీడియో సందేశంలో నీరజ్ మాట్లాడుతూ, ఒలింపిక్ పతకం సాధించేందుకు తనకు పదేళ్ల కఠిన శ్రమ పట్టిందని గుర్తు చేశారు. “నేటి యువ క్రీడాకారుల్లో ఓపిక తగ్గుతోంది. ఒక్క ఏడాదిలోనే పెద్ద విజయాలు సాధించాలని, రికార్డులు బద్దలు కొట్టాలని కోరుకుంటున్నారు. కానీ క్రీడల్లో ఎదగాలంటే సహనం, క్రమశిక్షణ చాలా అవసరం” అని అన్నారు.

కొన్నిసార్లు అథ్లెట్లు తీసుకునే సప్లిమెంట్లలో నిషేధిత పదార్థాలు ఉండే అవకాశం కూడా ఉంటుందని నీర‌జ్ హెచ్చరించారు. తాను జూనియర్ స్థాయిలో ఉన్నప్పుడు డోపింగ్ కేసుల గురించి విని ఆశ్చర్యపోయేవాడినని, అప్పుడే ఆ మార్గంలో ఎప్పటికీ వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని చెప్పారు.

గత మూడేళ్లుగా అత్యధిక డోపింగ్ ఉల్లంఘనలు జరిగిన దేశాల జాబితాలో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. ఈ మేర‌కు ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విడుద‌ల చేసిన‌ నివేదిక ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, క్రీడాకారులలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఐఓఏ తెలిపింది.

Cricket | భార‌త్ వ‌ర్సెస్‌ దక్షిణాఫ్రికా