ఘనంగా జాతీయ గ్రంథపాలకుల దినోత్సవం
- ఠాగూర్ గ్రంథాలయంలో గ్రంథపాలకులకు సన్మానం
- గ్రంథాలయ శాస్త్ర పితామహుడు ఎస్.ఆర్. రంగనాథన్ సేవలు స్మరణీయం
- పాఠకుడిని పుస్తకానికి.. పుస్తకాన్ని పాఠకుడికి చేరువ చేసిన మహనీయుడు
విజయవాడ, ఆంధ్రప్రభ: జాతీయ గ్రంథపాలకుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మాగాంధీ రోడ్డులోని ఠాగూర్ స్మారక గ్రంథాలయంలో బుధవారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రంథాలయ శాస్త్ర పితామహుడు డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎం.ఎస్. బేగ్ హాజరయ్యారు. తొలుత వివిధ గ్రంథాలయాల్లో సేవలందిస్తున్న గ్రంథపాలకులను ఘనంగా సత్కరించారు.
సిద్ధార్థ మహిళా కళాశాల గ్రంథపాలకురాలు మల్లిక, లయోలా కళాశాల గ్రంథపాలకురాలు రోజా, ఠాగూర్ గ్రంథాలయ గ్రేడ్-1 గ్రంథపాలకురాలు కె. రమాదేవి, గ్రేడ్-2 గ్రంథపాలకురాలు జి. ఉమారాణి, గ్రేడ్-3 గ్రంథపాలకురాలు ధనలక్ష్మి, డి. నాగేశ్వరరావులను దుశ్శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎం.ఎస్. బేగ్ మాట్లాడుతూ గ్రంథపాలకుల సేవలను కొనియాడారు. పుస్తకాన్ని పాఠకుడి వద్దకు, పాఠకుడిని జ్ఞానం వద్దకు తీసుకెళ్లిన మహనీయుడు ఎస్.ఆర్. రంగనాథన్ అని పేర్కొన్నారు.
ఆయనను భారతదేశ గ్రంథాలయ శాస్త్ర పితామహుడిగా గౌరవిస్తారని తెలిపారు. 1931లో రంగనాథన్ రచించిన ‘ఫైవ్ లాస్ ఆఫ్ లైబ్రరీ సైన్స్’ గ్రంథాలయ రంగానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. “ప్రతి పుస్తకం వినియోగం కోసం, ప్రతి పాఠకుడికి పుస్తకం, ప్రతి పుస్తకానికి పాఠకుడు, పాఠకుడి సమయం వృథా కాకూడదు, గ్రంథాలయం అభివృద్ధి చెందుతున్న జీవి” అనే ఐదు సూత్రాలను ఆయన ప్రతిపాదించారని వివరించారు. కాలానుగుణంగా పుస్తకాలు, పాఠకులు, సాంకేతికత, గ్రంథాలయ సేవలు అభివృద్ధి చెందుతూ ఉండాలని ఆయన సూత్రాలు సూచిస్తున్నాయని తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది, పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
