సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శివప్రసాద్‌కు ఘన వీడ్కోలు
నర్సాపురం, ఆంధ్రప్రభ: నరసాపురం పురపాలక సంఘ కార్యాలయంలో మేనేజర్‌గా విధులు నిర్వహించిన నందికట్టు ఎ.వి. శివప్రసాద్ పదవీవిరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. పురపాలక సంఘ కమిషనర్ ఆర్. వెంకటరామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సన్మాన సభలో మున్సిపల్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని శివప్రసాద్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా శివప్రసాద్ దంపతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
కార్యక్రమంలో కమిషనర్ వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగం కేవలం ఉపాధి మాత్రమే కాకుండా ప్రజాసేవకు అంకితమైన బాధ్యత అని అన్నారు. ఎండ, వర్షం, పండుగలు, అత్యవసర పరిస్థితులు అన్న తేడా లేకుండా ప్రజల కోసం పనిచేసే ఉద్యోగులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్వో గుణ్ణం మురళీధర్ మాట్లాడుతూ శివప్రసాద్ శాఖలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ఆదర్శ ఉద్యోగిగా నిలిచారని కొనియాడారు. డీఈ ప్రసాద్ మాట్లాడుతూ కొత్తగా చేరిన ఉద్యోగులకు విలువైన సూచనలు అందించి మార్గదర్శకుడిగా వ్యవహరించారని చెప్పారు. ఆర్ఐ కృష్ణమోహన్ మాట్లాడుతూ శివప్రసాద్ ఓర్పు, నేర్పును జూనియర్ ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఈ కిషోర్, నవ్య, గుర్రం సతీష్, సాగర్‌తో పాటు వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
