మంత్రి కొండ సురేఖ ఇల్లు ముట్టడి..

పరకాల, ఆంధ్రప్రభ : సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు మంగళవారం హనుమకొండలో మంత్రి కొండా సురేఖ నివాసాన్ని ముట్టడించి తమ సమస్యల పరిష్కారం కోరారు.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆందోళనలో భాగంగా పరకాల మున్సిపాలిటీకి చెందిన కార్మికులు హనుమకొండ చేరుకుని మంత్రి నివాసం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమానికి పరకాల మున్సిపాలిటీ సీఐటీయూ అధ్యక్షుడు మడికొండ ప్రమోద్ కుమార్ నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, విధుల్లో ఉండగా మరణించిన కార్మికుల కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం రూ.30 వేల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా 60 సంవత్సరాలు పూర్తి చేసిన కార్మికుల స్థానంలో వారి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని, మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా మార్చాలని కోరారు. ఇళ్లులేని పేద కార్మికులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద గృహాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

అనంతరం ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు కార్మికులతో మాట్లాడి, వారి సమస్యలను మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా సీఐటీయూ నాయకులు టి. ఉప్పలయ్య, బొట్ల చక్రపాణి, యాస బాబు, మహేష్, పరకాల మున్సిపాలిటీ సీఐటీయూ నాయకులు బొచ్చు ఐలయ్య, పసుల సారయ్య, చెరుకు నాగరాజు, కోవెల సుమన్, మడికొండ వసంత, దుప్పటి తిరుమల, గుర్రం సరోజన, బొచ్చు సురేష్, రత్న జీవన్ కుమార్, మడికొండ సుధాకర్, మల్లికాంబ, సుమలతతో పాటు పంప్ ఆపరేటర్లు, కరెంట్ ఆపరేటర్లు, జవాన్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.