Narayanapeta | రాజకీయ కక్ష సాధించడం సరికాదు..
Narayanapeta | రాజకీయ కక్ష సాధించడం సరికాదు..
- బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి
Narayanapeta | నారాయణపేట ప్రతినిధి, ఆంధ్రప్రభ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, ఆయన గద్దె దిగితేనే మహానేత ఎన్టీఆర్కు నిజమైన నివాళి అవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి తీవ్రంగా వ్యాఖ్యానించారు. సీఎం చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు నారాయణపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నల్లపు లింగయ్యకు ఆయన అధికారికంగా ఫిర్యాదు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్. రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఒక సమావేశంలో అత్యంత చౌకబారు, అసహ్యకరమైన వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. చంద్రశేఖర రావును దెబ్బతీయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ‘వంద మీటర్ల గొయ్యి తీసి పాతిపెట్టాలి’, ‘ఊర్లలో బీఆర్ఎస్ దిమ్మెలు కూలాలి’ అంటూ సీఎం వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థను అవమానపరిచినట్లేనని విమర్శించారు.
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రాజకీయ ప్రత్యర్థులపై ఈ స్థాయి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరమన్నారు. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి రాజకీయ కక్ష సాధించడం సరికాదని, నిజంగా ఎన్టీఆర్కు నివాళి అర్పించాలంటే ప్రజాస్వామ్యాన్ని, విలువలను కాపాడాలని సూచించారు. అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు మంగళవారం రాత్రి సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని ఆదేశించడం ఎంతవరకు న్యాయసమ్మతమని ప్రశ్నించారు.
ఇప్పటికే కోర్టు నుంచి క్లిన్ చిట్ వచ్చినప్పటికీ, సిట్ పేరుతో వేధింపులకు పాల్పడటం సిగ్గుచేటని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేతో పాటు బీఆర్ఎస్ నాయకులు విజయసాగర్, చెన్నారెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, బోయ లక్ష్మన్, సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
