గంజాయిపై ఉక్కుపాదం.. ఐదు నెలల్లో 23 మంది అరెస్ట్, 23 కేజీలకు పైగా స్వాధీనం

నంద్యాల బ్యూరో, ఆంధ్రప్రభ: జిల్లాలో యువత భవిష్యత్తును నాశనం చేసే గంజాయి, మత్తు పదార్థాలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ హెచ్చరించారు. గంజాయి విక్రయాలు, రవాణా లేదా అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, ఈ ఏడాది జనవరి నుంచి మే నెల వరకు జిల్లాలో మొత్తం 8 గంజాయి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుల్లో 23 మంది నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి 23.193 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కట్టుబడి ఉందని పేర్కొన్న ఆయన, గంజాయి రవాణా, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నట్లు తెలిపారు. పాత నేరస్తుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతూ విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నామని చెప్పారు.

గంజాయి నిర్మూలనతో పాటు యువత వ్యసనాలకు బానిస కాకుండా ముందస్తు చర్యలు కూడా చేపడుతున్నామని ఎస్పీ వివరించారు. జిల్లాలోని అన్ని శాఖల సమన్వయంతో పాఠశాలలు, కళాశాలలు, ప్రజలు అధికంగా సంచరించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

గంజాయి, ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై విద్యార్థులు, యువత, ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. యువత తమ బంగారు భవిష్యత్తును వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

గంజాయి రవాణా, విక్రయాలు లేదా యువతను వ్యసనాల వైపు ప్రోత్సహించే వారిపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేస్తామని, అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేయడానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు.

జిల్లాలో ఎక్కడైనా గంజాయి విక్రయాలు లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ సునీల్ షొరాణ్ తెలిపారు.