పాత రిగ్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు..

పాత రిగ్‌లో ఒక్కసారిగా ఎగసిన మంటలు..

స్థానికుల్లో కలకలం

నంగేగడ్డ ఓఎన్జీసీ పాయింట్‌లో అగ్ని ప్రమాదం.. పొలాల మధ్య ఘటనతో రైతుల్లో భయాందోళన

నాగాయలంక – ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా నాగాయలంక మండలం పరిధిలోని వక్కపట్లవారిపాలెం – భావదేవరపల్లి పంట పొలాల మధ్య ఉన్న నంగేగడ్డ పాత ఓఎన్జీసీ రిగ్ పాయింట్ వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో చుట్టుపక్కల ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి.

పాత రిగ్ ప్రాంతంలో మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా స్పష్టత రాలేదు. వేసవి ఎండల తీవ్రత కారణమా లేక పంట పొలాల్లో ఎవరో తుక్కు కాల్చడం వల్లనా అనే అంశంపై పరిశీలన కొనసాగుతోంది.

మంటల కారణంగా రిగ్ పరిసరాల్లో ఉన్న ముండ్ల చెట్లు దగ్ధమయ్యాయి. పొగ భారీగా వ్యాపించడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సమీపంలోని రైతుల పొలాలు కూడా ప్రభావితమయ్యాయి.

సమాచారం అందుకున్న వెంటనే అవనిగడ్డ అగ్నిమాపక శాఖ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అధికారులు తెలిపారు.

ఘటన సమయంలో నాగాయలంక తహశీల్దార్ సిహెచ్ వీరాంజనేయ ప్రసాద్, అవనిగడ్డ సీఐ జి యువకుమార్, ఎస్ఐ కె రాజేష్, ఓఎన్జీసీ సిబ్బంది పరిస్థితిని పర్యవేక్షించారు.

Leave a Reply