Municipal Elections | కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ..

Municipal Elections | కాంగ్రెస్ బుజ్జగింపులు షురూ..

Municipal Elections, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపాలిటీలో అధికార కాంగ్రెస్ పార్టీలో ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది. మరో పక్క నామినేషన్ల స్వీకరణ ప్రారంభం అయ్యింది. కౌన్సిలర్ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొనడంతో.. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ 12 వార్డులకు సంబంధించి అభ్యర్థుల తుది జాబితాను ఇప్పటికే సిద్ధం చేసినట్లు తెలిసింది. ఈ జాబితా ఆధారంగా ఆయా వార్డులలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులను బుజ్జగించేందుకు కాంగ్రెస్ ముఖ్య నాయకులు రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని టికెట్ ఆశించి భంగపడిన అభ్యర్థులకు.. మీకు త్వరలోనే నామినేటెడ్ పోస్టులు ఇస్తామని హామీ ఇస్తున్నట్లు సమాచారం.

నామినేషన్ల స్వీకరణ తొలి రోజు కాంగ్రెస్ కి చెందిన ముగ్గురు అభ్యర్థులు 3,4, 12 వార్డులలో ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు. నేడు నామినేషన్ల పర్వం రెండో రోజు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు, ఆశావాహులు నామినేషన్లు వేస్తుండడంతో ఇప్పటికే నాయకులు రంగంలోకి దిగి ..బుజ్జగింపుల పర్వం షురూ చేశారు. మొత్తం 12 వార్డులలో ఓ నాలుగైదు వార్డులలో అభ్యర్థుల మధ్య కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం గట్టి పోటీ ఉండడంతో.. ఆ వార్డులో పార్టీ అభ్యర్థులు మినహా ఇతరులను రంగంలోకి దిగకుండా ఉండేందుకు బుజ్జగింపులకు పాల్పడుతున్నారు.

ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకుంటే బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి సైతం టికెట్ దక్కించుకొని మున్సిపల్ పోరులో దిగాలని పలువురు ఆశ పడుతున్నారు. పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు నామినేటెడ్ పోస్టులను ఆశించి సహకరించేందుకు.. మరి కొంతమంది ఆశావాహులు తమ తమ ప్రయత్నాల్లో ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ.. మోత్కూరు మున్సిపల్ పోరులో ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ నెలకొననుంది. పార్టీ సింబల్ తో ఎన్నికలు నిర్వహిస్తుండడంతో.. దాదాపుగా ఆయా పార్టీల బీఫారం పొందేందుకు జంప్ జిలానీలు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.