AP | పోలీస్ శాఖలో కఠిన చర్యలు..
AP | పోలీస్ శాఖలో కఠిన చర్యలు..
AP, కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : పత్తికొండ కోర్టు ప్రాంగణంలో చోటు చేసుకున్న ఘటన పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. కోర్టులో సరెండర్ అవుతున్న వ్యక్తిని న్యాయస్థాన ప్రాంగణం నుంచే పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటన పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో, సంబంధిత పోలీస్ అధికారుల పై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి చిప్పగిరి పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ బి. సతీష్‌కుమార్, పత్తికొండ యూపీఎస్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ ఆర్. విజయ్‌కుమార్లను పరిపాలనా కారణాలతో వీఆర్ కర్నూలుకు బదిలీ చేస్తూ జిల్లా పోలీసు కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిని తక్షణమే విధుల నుంచి రిలీవ్ చేసి, కర్నూలులోని డీఎస్‌బీ–1 ఇన్‌స్పెక్టర్ ముందు హాజరుకావాలని ఆదేశించారు. వారు విధుల్లో చేరిన తేదీలను జిల్లా పోలీసు కార్యాలయానికి తెలియజేయాలని డీఎస్‌బీ–1 ఇన్‌స్పెక్టర్‌కు స్పష్టం చేశారు.
అదే విధంగా, ఈ కేసుకు సంబంధించిన పరిణామాల్లో భాగంగా చిప్పగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుళ్లు ఎస్. షబ్బర్ భాషా (జి.నెం.3124), ఎన్. రామోజీ (జి.నెం.856)లను కూడా పరిపాలనా కారణాలతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు వీఆర్ కర్నూలుకు తీసుకువచ్చినట్లు జిల్లా పోలీసు కార్యాలయం వెల్లడించింది. వారు విధుల్లో చేరిన తేదీలను జిల్లా పోలీసు కార్యాలయానికి తెలియజేయాలని రిజర్వ్ ఇన్‌స్పెక్టర్‌కు సూచించారు. కోర్టు పరిధిలో న్యాయ ప్రక్రియకు భంగం కలిగేలా వ్యవహరించడాన్ని హైకోర్టు అత్యంత తీవ్రంగా పరిగణించినట్లు తెలిసింది. కోర్టు ఆవరణలో జరిగే ప్రతి చర్య చట్టబద్ధంగా, న్యాయస్థాన గౌరవానికి అనుగుణంగా ఉండాలని, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తే సహించేది లేదని కోర్టు స్పష్టంగా పేర్కొన్నట్టు సమాచారం.
ఈ ఘటనతో పోలీస్ శాఖలో చట్టపరమైన అవగాహన, బాధ్యతాయుత ప్రవర్తన పై మళ్లీ చర్చ మొదలైంది. కోర్టు పరిధిలో పోలీసులు పాటించాల్సిన నిబంధనల పై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఇలాంటి ఘటనలు పోలీస్ వ్యవస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తంగా చూస్తే, హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో తీసుకున్న ఈ చర్యలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికగా నిలుస్తాయా? లేక పరిపాలనా చర్యలకే పరిమితమవుతాయా? అన్న అంశం పై పోలీస్ శాఖతో పాటు ప్రజల్లోనూ చర్చ కొనసాగుతోంది.
