రోడ్డుపై గుంతలు పూడ్చిన గ్రామపంచాయతీ పాలకవర్గం

ఆర్‌అండ్‌బీ నిర్లక్ష్యంతో గ్రామపంచాయతీ చొరవ..

రహదారి మరమ్మతులకు వాహనదారుల విజ్ఞప్తి

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలం ముచ్కూర్ గ్రామంలో అధ్వానంగా మారిన రహదారిపై ఏర్పడిన గుంతలను గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో మంగళవారం పూడ్చివేశారు.

గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ రమేష్ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ సిబ్బంది ఈ పనులు చేపట్టారు. రహదారి దుస్థితిపై ఎన్నోసార్లు సంబంధిత అధికారులకు విన్నవించినప్పటికీ స్పందన లేకపోవడంతో గ్రామపంచాయతీయే చొరవ తీసుకున్నట్లు తెలిపారు.

వర్షాకాలంలో కురిసిన వర్షాలకు రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రమాదాలను నివారించేందుకు తాత్కాలికంగా గుంతలను పూడ్చినట్లు తెలిపారు.

గత ఏడు నెలలుగా రహదారి మరమ్మతుల కోసం ఆర్‌అండ్‌బీ అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామపంచాయతీ ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు స్పందించి రహదారిని శాశ్వతంగా మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు.