రెన్యూవల్ ఆలస్యమైతే కోల్పోయే ప్రయోజనాలు

రెన్యూవల్ ఆలస్యమైతే కోల్పోయే ప్రయోజనాలు
ముంబై: మోటార్ ఇన్సూరెన్స్ను సకాలంలో రెన్యూవల్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు. లేదంటే రెన్యూవల్ వల్ల పొందే ప్రయోజనాలపై ప్రభావం పడుతుంది. ఇలాంటి ప్రయోజనాల్లో అత్యంత ముఖ్యమైనది నో క్లెయిమ్ బోనస్ (ఎన్సీబీ). ప్రతి క్లెయిమ్ రహిత సంవత్సరానికి ఇన్సూరర్ రివార్డుగా అందిస్తారని Bajaj Allianz General Insurance చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ Rakesh Kaul చెప్పారు. మొదటి సంవత్సరం తరువాత ఎన్సీబీ 20 శాతంతో ప్రారంభమై, వరుసగా 5 సంవత్సరాల తరువాత 50 శాతం వరకు పెరుగుతుంది. దీని వల్ల ప్రీమియాన్ని గణనీయంగా పొదుపు చేయవచ్చని ఆయన వివరించారు.
సాధారణంగా రెన్యూవల్ తేదీని మిస్ చేస్తే ఇన్సూరెన్స్ సంస్థలు 90 రోజుల గ్రేస్ పీరియడ్ను ఇస్తాయి. ఈ సమయంలో పాలసీని రెన్యూవల్ చేసుకుంటే ఎన్సీబీ కొనసాగుతుంది. లేకుంటే ఇది ఆటోమెటిక్‌గా ల్యాప్స్ అవుతుంది. దీని వల్ల ఇప్పటి వరకు పొందిన డిస్కౌంట్లు, ప్రయోజనాలు అన్నీ కోల్పోతారు. ఆపై మీ బోనస్ను మళ్లీ మొదటి నుంచి ప్రతి సంవత్సరం జమ చేయాల్సి వస్తుంది. పాలసీ రెన్యూవల్ చేసుకోకుంటే ఎన్సీబీని ప్రభావితం చేస్తుంది. వాహనానికి ఇన్సూరెన్స్ కవరేజీ లేకుండా పోతుంది. దీని వల్ల ఆర్థిక, చట్టపరమైన సమస్యలు వస్తాయి. ఇన్సూరెన్స్ లేకుండా వాహనాన్ని నడిపించడం చట్ట విరుద్ధం. ప్రమాదం జరిగే అన్ని ఖర్చులను వాహనదారుడే పూర్తిగా భరించాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు అదనపు భద్రత కోసం ఎన్సీబీ ప్రొటెక్షన్ యాడ్ ఆన్ కవర్ను కూడా అందిస్తున్నాయి.
షరతులకు లోబడి, పాలసీ కాలంలో క్లెయిమ్ చేసినప్పటికీ, ఈ ఫీచర్ ఎన్సీబీని కొనసాగేందుకు వీలు కల్పిస్తుంది. ఇన్సూరెన్స్ సంస్థను మార్చినా, నిర్ణీత గడువులోగా పాలసీని రెన్యూ చేస్తే ఎన్సీబీని కొత్త పాలసీకి సులభంగా బదిలీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
మోటార్ ఇన్సూరెన్స్ కేవలం చట్టపరమైన అవసరమే కాకుండా సురక్షిత డ్రైవింగ్‌కు ప్రోత్సాహం అందించే ఆర్థిక క్రమశిక్షణ అని రాకేష్ కౌల్ వివరించారు. నో క్లెయిమ్ బోనస్ ప్రధానంగా ప్రీమియాన్ని తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. పాలసీని క్రమం తప్పకుండా రెన్యూ చేసుకోవడం ద్వారా నిరంతర రక్షణ పొందవచ్చు. బాధ్యతాయుతమైన వాహన యజమానిగా ఆర్థిక పరమైన రక్షణ పొందవచ్చని ఆయన తెలిపారు.
