మోత్కూర్ కి జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ మంజూరు…!

  • 3,4 నెలల్లో తాత్కాలిక భవనంలో కోర్టు ఏర్పాటు
  • కోర్ట్ ఉద్యోగులు,సిబ్బంది నియామకం షురూ..
  • తీరనున్న మోత్కూర్, అడ్డగుడూర్, ఆత్మకూరు, గుండాల మండలాల ప్రజల కళ
  • కోర్ట్ మంజూరు తో తపనున్న.. దశాబ్దాల తిప్పలు
  • కోర్ట్ ఏర్పాటు కై ఎమ్మెల్యే సామెల్ కృషి

మోత్కూర్, ఆంద్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు కోసం ముమ్మర యత్నాలు జరుగుతున్నాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ ఎన్నికల్లో గెలిచిన వెంటనే మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు పంపించారు. ఇటీవల సైతం హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ గోవర్ధన్ రెడ్డి ని స్వయంగా కలిసి మోత్కూర్, అడ్డగుడూర్,ఆత్మకూరు, గుండాల మండలాల ప్రజల సౌకర్యం, సత్వర న్యాయసేవల నిమిత్తం మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందించారు.4 మండలాల పరిధిలో ప్రస్తుతం 1800 కేసులు ఉన్నాయని,కోర్ట్ ఆవశ్యకత పై రిజిస్ట్రార్ జనరల్ కు క్లుప్తంగా వివరించారు.

ఇటీవలే ఆయా మండలాలకు సంబంధించి రామన్నపేట, ఆలేరు కోర్ట్ లలో ఎన్ని కేసులు ఉన్నాయి(పెండెన్సీ) లెక్కలు కూడా తీసినట్లు సమాచారం.1994 లోనే మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు నిమిత్తం మంజూరు అయ్యే దశలో అప్పటి స్థానిక నేతలు పట్టించుకోలేదని,దీంతో ఆ కోర్ట్ కాస్త ఆలేరు కి తరలివెళ్లినట్లు సమాచారం.గత 6 నెలల క్రితం సైతం మోత్కూర్ లో ఏర్పాటు కావాల్సిన కోర్ట్ సైతం చౌటుప్పల్ కి తరలినట్లు సమాచారం.మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు తో 4 మండలాల ప్రజలకు వ్యవ ప్రయాసాలతో పాటు ప్రధానంగా ఆర్ధిక భారం తప్పనుంది.రాబోయే వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో డీలిమిటేషన్ బిల్లు పాస్ అయితే మోత్కూర్ నియోజకవర్గ ఏర్పాటు కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, మేధావులు ,నియోజకవర్గ సాధన సమితి ప్రతినిధులు తీవ్ర కృషి చేస్తున్నారు.నియోజకవర్గ ఏర్పాటు కోసం కోర్ట్,30 పడకల ఆసుపత్రి,పోస్ట్ మార్టం సౌకర్యం ,ఆయా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు తప్పనిసరి కావడంతో ,మోత్కూర్ లో కోర్ట్ మంజూరు అయిందన్న సమాచారం కాస్త ఈ ప్రాంత ప్రజల్లో ఆనందాన్ని రేకెత్తిస్తోంది. దశాబ్దాల కాలంగా కనీసం బస్సు సౌకర్యం సైతం లేని రామన్నపేట తో పాటు,సుదూరంలో ఉన్న ఆలేరు కోర్ట్ కి వెళ్లి రావడం ఈ నాలుగు మండలాల ప్రజలకు తీరని వ్యధగా ఉండేది.కొన్ని సందర్భాలలో బస్సు సౌకర్యం సరిగా లేక,కోర్టుకు ఆలస్యంగా వెళ్లడంతో వారెంట్ జారీ అయిన వ్యక్తులకు రిమాండ్ సైతం విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.కొన్ని దశాబ్దాల తర్వాత మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు తో ఈ ప్రాంత ప్రజల చిరకాల కళ నేరవేరనుండడంతో ప్రజలు,వ్యాపారులు, కక్షిదారులు,స్థానిక జూనియర్, సీనియర్ న్యాయవాదులు,కోర్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలకు పరిపాలన సౌలభ్యం కోసం మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు సంతోషకరం
గడ్డం నర్సింహా, జూనియర్ అడ్వకేట్,మోత్కూర్

ప్రభుత్వం నూతన జిల్లాలు,మండలాలు,గ్రామాలు పెంచినప్పటికి పలు శాఖల కార్యాలయాలు సుదూరంగా ఉండడంతో ప్రజలకు పరిపాలన ఇబ్బందిగా ఉంది.మోత్కూర్ ,అడ్డగుడూర్, ఆత్మకూరు, గుండాల మండలాల ప్రజలకు మోత్కూర్ అన్ని రకాలుగా అనువైన దగ్గర ప్రాంతం. ఇక్కడ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ఏర్పాటు హర్షణీయం.ప్రజలకు పరిపాలన,న్యాయ సేవలు అందుబాటులో ఉండి ఆర్ధిక భారం సైతం తగ్గుతుంది. చిన్న, చిన్న కేసులకు సైతం సులువుగా ఉంటుంది. వాహనాల పెనాల్టీ, డ్రంక్ డ్రైవ్ కేసులతో పాటు పలు కేసుల్లో సైతం మోత్కూర్ లోనే సదరు ఫైన్ అమౌంట్ చెల్లించి సమయభావాన్ని వృధా కాకుండా చూడొచ్చు.

మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు కి కృషి
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్

మోత్కూర్ పాత తాలుకాతో పాటు,సమితిగా కొనసాగింది.మోత్కూర్, గుండాల, ఆత్మకూరు మండలాలతో మోత్కూర్ కేంద్రంగా ఉండేది.ఉమ్మడి మోత్కూర్ నుండి అడ్డగుడూర్ మండలం నూతన మండలంగా ఏర్పడింది.రామన్నపేట కోర్ట్ కి వెళ్లాలంటే కనీసం బస్సు సౌకర్యం లేదు.కొన్ని దశాబ్దాలుగా నా చిన్నతనం నుండి ఆయా కేసుల నిమిత్తం ఇక్కడి ప్రజలు పొద్దున పొతే చీకటి పడ్డాక వచ్చేవాళ్లు.ఈ ఇబ్బందులు గమనించి మోత్కూర్ లో కోర్ట్ కోసం కృషి చేశా.ప్రతిపాదనలు పంపించా.ఇటీవల హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు సైతం మోత్కూర్ లో కోర్ట్ ఏర్పాటు కి వినతిపత్రం అందించా.ఆర్ధిక శాఖ (ఫైనాన్స్) క్లియరెన్స్ తర్వాత 3,4 నెలల్లో కోర్ట్ ఏర్పాటు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్న. ప్రజలకు అందుబాటులో న్యాయసేవలు అందించడం ప్రజాప్రతినిధుల బాధ్యత.ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డగా,నా వంతుగా ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తా.