ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు దండు మల్కాపురం విద్యార్థినుల ఎంపిక

​చౌటుప్పల్, ఆంధ్రప్రభ : ఫుట్‌బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు చౌటుప్పల్ మండలం దండు మల్కాపురంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న జి. భవ్య, 7వ తరగతి చదువుతున్న వై. రష్మిక తమ ప్రతిభతో రాష్ట్ర స్థాయి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈనెల 3, 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో వీరు ఉమ్మడి జిల్లా తరఫున పాల్గొననున్నారు. ​

ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 2వ తేదీన నల్గొండ జిల్లా చర్లపల్లిలో సబ్ జూనియర్ (అండర్-14) బాలికల ఎంపిక పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో దండు మల్కాపురం జెడ్పీ ఉన్నత పాఠశాల నుండి ఆరుగురు విద్యార్థినులు పాల్గొని అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. వారిలో భవ్య, రష్మికలు అద్భుత ఆటతీరుతో సెలెక్టర్లను ఆకట్టుకుని రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ​రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై పాఠశాల కీర్తిని చాటిన విద్యార్థినులను ప్రధానోపాధ్యాయురాలు ఆర్. శోభ, ఫిజికల్ డైరెక్టర్ భావన, పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించి రాష్ట్ర స్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.