Gujarat | మరో ఐదుగురు అరెస్ట్…

Gujarat | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) భగ్నం చేసింది. పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ జైష్-ఏ-మహ్మద్ (జేఈఎం)తో సంబంధాలు ఉన్న మరో ఐదుగురిని అరెస్టు చేసింది. ఈ నెల ప్రారంభంలో ఇదే మాడ్యూల్‌కు చెందిన ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న అనంతరం జరిగిన విచారణలో ఈ ఐదుగురి ప్రమేయం వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

పటాన్ జిల్లాలోని ఖడియాల్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో బిలాల్ అబిద్‌బాయ్ షెరా, మహ్మద్ అయూబ్ కడివాలా, మహ్మద్ పలన్‌పురి అలియాస్ ఖలీ అయూబ్ సున్సారా, షఫియా రైస్ ముక్తి, మహ్మద్ హసన్ కర్డియాలను ఏటీఎస్ అదుపులోకి తీసుకుంది.

అరెస్టైన నిందితులను కోర్టులో హాజరుపరచగా, విచారణ నిమిత్తం జూలై 24 వరకు ఏటీఎస్ కస్టడీకి అప్పగించింది. వీరిని సుదీర్ఘంగా విచారిస్తూ ఉగ్ర నెట్‌వర్క్‌కు సంబంధించిన కీలక సమాచారం సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

టైం బాంబుల కుట్రపై దర్యాప్తు..

దర్యాప్తులో భాగంగా నిందితుల్లో ఒకరు టైం బాంబు తయారు చేసేందుకు ప్రయత్నించినట్లు గుర్తించినట్లు ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దేశంలోని పలు ప్రాంతాల్లో టైం బాంబులు అమర్చి పేలుళ్లకు పాల్పడే కుట్ర జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

అయితే బాంబు తయారీకి ఉపయోగించిన సామగ్రి, జైష్-ఏ-మహ్మద్‌కు సంబంధించిన ఉర్దూ సాహిత్యం ఇంకా స్వాధీనం చేసుకోవాల్సి ఉందని కోర్టుకు వివరించారు.

విఫలమైన పేలుడు పదార్థ పరీక్ష..

ముఠా సభ్యులు తయారు చేసిన పేలుడు పదార్థాన్ని పరీక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఆ ప్రయోగం విఫలమైనట్లు ఏటీఎస్ అధికారులు వెల్లడించారు. పేలుడు పదార్థాల తయారీకి అవసరమైన సామగ్రి ఎక్కడి నుంచి సేకరించారు, ఎక్కడ దాచారు, ఉగ్ర సంస్థకు సంబంధించిన ప్రచార సాహిత్యం వారికి ఎలా చేరిందనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

ఇప్పటికే ఎనిమిది మంది అరెస్టు..

ఈ కేసులో జూలై 3న గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఏటీఎస్, జైష్-ఏ-మహ్మద్‌తో సంబంధాలు ఉన్నట్లు అనుమానిస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేసింది. గుజరాత్‌లో క్రియాశీల ఉగ్ర నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు అప్పట్లో అధికారులు వెల్లడించారు.

తాజా అరెస్టులతో ఈ మాడ్యూల్‌కు సంబంధించిన మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. దేశంలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులకు జరిగిన కుట్రను ముందుగానే గుర్తించి అడ్డుకున్నామని ఏటీఎస్ అధికారులు తెలిపారు.