మోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో స్వర్ణాధ్యాయం

మోదీ 12 ఏళ్ల పాలన దేశ చరిత్రలో స్వర్ణాధ్యాయం

  • ఏలేటి మహేశ్వర్ రెడ్డి

కడెం, ఆంధ్రప్రభ : భారతదేశంలో అత్యధిక కాలం ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారని బీజేపీ శాసనసభాపక్ష నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బీజేపీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు రితేష్ రాథోడ్ అన్నారు.

శనివారం కడెం మండలంలోని కొండుకూర్ ఎస్‌కే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ‘ప్రధాని నరేంద్ర మోదీ 12 ఏళ్ల పాలన – నిర్మల్ జిల్లా ప్రతినిధుల సమ్మేళనం’ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ, పన్నెండేళ్ల సుదీర్ఘ పాలనలో ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన నాయకుడు నరేంద్ర మోదీ అని కొనియాడారు.

సాధారణంగా ఏ ప్రభుత్వం అయినా కొద్ది సంవత్సరాలకే ప్రజల్లో వ్యతిరేకతను ఎదుర్కొంటుందని, అయితే స్థిరమైన, ప్రజాకేంద్రిత పాలనతో మోదీ అత్యధిక కాలం ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న ప్రధానిగా నిలిచారని పేర్కొన్నారు.

పరిపాలన అంటే కేవలం అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే కాకుండా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల విశ్వాసాలను ప్రపంచవ్యాప్తంగా గౌరవప్రదంగా చాటిచెప్పడం కూడా ముఖ్యమని, ఆ బాధ్యతను మోదీ సమర్థంగా నిర్వర్తించారని అన్నారు.

దశాబ్దాలుగా కొనసాగిన వారసత్వ రాజకీయాలకు ముగింపు పలికి, 140 కోట్ల మంది భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న నాయకుడు మోదీ అని పేర్కొన్నారు. సాధారణ కుటుంబం నుంచి దేశ ప్రధానిగా ఎదిగి 12 ఏళ్ల పాటు ప్రజాసేవలో కొనసాగడం ఆయన కృషికి నిదర్శనమన్నారు.

ఆర్టికల్ 370 రద్దు, ఉగ్రవాదంపై కఠిన చర్యలు, అయోధ్యలో రామమందిర నిర్మాణం, ట్రిపుల్ తలాక్ రద్దు వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో దేశ గతిని మార్చారని కొనియాడారు.

‘ప్రధానమంత్రి కాదు, ప్రధాన సేవకుడిని’ అని చెప్పడమే కాకుండా ఆ మాటలను చేతల్లో నిరూపించిన నాయకుడు మోదీ అని అన్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి దేశ సేవకే అంకితమైన నాయకుడిగా ఆయన నిలిచారని పేర్కొన్నారు.

గత 12 ఏళ్ల పాలనలో ప్రధాని లేదా కేంద్ర మంత్రివర్గంపై ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేకపోవడం కేంద్ర ప్రభుత్వ పారదర్శకతకు నిదర్శనమని అన్నారు. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్, ఆకుల శ్రీనివాస్, రాజు యాదవ్, యాతాళం చిన్నారెడ్డి, జిల్లా నాయకులు నల్లా రవీందర్ రెడ్డి, సత్యం చంద్రకాంత్, బుర్ర రమేష్, ఎన్. శారద, అంకం మహేందర్, నల్లా రమేష్, తాడేవర్ సాయినాథ్, జిల్లా వ్యాప్తంగా మండల అధ్యక్షులు, కౌన్సిలర్లు, బీజేపీ కడెం మండల అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, సర్పంచ్‌లు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.