జర్నలిజానికి వన్నె తెచ్చేలా పనిచేయాలి: ఎమ్మెల్యే
జర్నలిజానికి వన్నె తెచ్చేలా పనిచేయాలి: ఎమ్మెల్యే
దిశ ఆర్సీ వాసుకు జన్మదిన శుభాకాంక్షలు
నిజాలను నిర్భయంగా వెలుగులోకి తేవాలని సూచన
కోదాడ, (ఆంధ్రప్రభ): జర్నలిజం సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుందని, పాత్రికేయులు నిష్పక్షపాతంగా పనిచేస్తూ వృత్తికి మరింత వన్నె తీసుకురావాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్ అన్నారు.
దిశ పత్రిక కోదాడ ఆర్సీగా బాధ్యతలు నిర్వహిస్తున్న జర్నలిస్టు వాసు జన్మదినం సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పేద, మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాసు జర్నలిజంపై ఆసక్తితో పలు పత్రికల్లో పనిచేస్తూ ప్రస్తుతం దిశ పత్రికలో బాధ్యతలు నిర్వహించడం అభినందనీయమన్నారు. వార్తల పట్ల అంకితభావంతో పనిచేస్తూ సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేస్తున్నారని కొనియాడారు.
ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలిచే జర్నలిజం ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత ముఖ్యమైనదని పేర్కొన్నారు. వాస్తవాలను వెలుగులోకి తేవడం ద్వారా సమాజానికి మేలు జరుగుతుందని, అవినీతిని అరికట్టడంలో మీడియా పాత్ర ఎంతో కీలకమని అన్నారు.
జర్నలిస్టులు నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ప్రజాస్వామ్య విలువలు మరింత బలోపేతం అవుతాయని పేర్కొన్న ఎమ్మెల్యే, వాసు మరింత ఉన్నత స్థాయికి చేరుకుని జర్నలిజం రంగంలో విశిష్ట గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు రావెళ్ల కృష్ణారావు, షేక్ షరీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎడవల్లి బాల్రెడ్డి, జూలూరు బసవయ్య, బండి శ్రీనివాస్, మైలారం శెట్టి భాస్కరరావు, పాత్రికేయులు, అభిమానులు పాల్గొని వాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
