లేపాక్షి ఆలయ చైర్మన్ మార్పుపై చర్చలు…

లేపాక్షి ఆలయ చైర్మన్ మార్పుపై చర్చలు…

కొనసాగించాలని ప్రజల డిమాండ్

హిందూపురం, ఆంధ్రప్రభ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన లేపాక్షి దేవాలయం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన చైర్మన్ కరణం రమానంద్‌ను మార్చే అంశంపై ప్రస్తుతం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చలు జోరందుకున్నాయి. ఆయనను కొనసాగించాలని స్థానికులతో పాటు ఇతర ప్రాంతాల ప్రజలు కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కరణం రమానంద్ దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపించారు.

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ప్రత్యేక పూజలు, అలంకరణలు, పండుగల నిర్వహణలో కొత్త ప్రమాణాలు నెలకొల్పారు. ముఖ్యంగా శరన్నవరాత్రులు, శివరాత్రి, లేపాక్షి ఉత్సవాలను ఘనంగా నిర్వహించి ఆలయ ఖ్యాతిని మరింత పెంచారు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మార్గదర్శకత్వంలో ఆయన చేపట్టిన చర్యల వల్ల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగి, హుండీ ఆదాయం కూడా వృద్ధి చెందింది.

పర్యాటకులకు ప్రత్యేక గైడ్‌లను ఏర్పాటు చేసి ఆలయ చరిత్రను పరిచయం చేయడం ద్వారా లేపాక్షి కీర్తిని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా, వ్యక్తిగత నిధులతో కూడా ఆలయ అభివృద్ధికి తోడ్పడటం ఆయన నిబద్ధతను చూపిస్తోంది. వీఐపీలు, ప్రముఖులను సమర్థంగా స్వాగతించడం, స్థానికులకు అందుబాటులో ఉండటం వంటి అంశాల్లో ఆయన ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇలాంటి సమయంలో ఆయనను మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలతో భక్తులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఎవరూ చేయని విధంగా పదవికి గౌరవం తీసుకువచ్చిన రమానంద్‌ను కొనసాగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే బాలకృష్ణ, వారి కార్యదర్శులు పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, సమర్థులైన వ్యక్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేపాక్షి ఆలయ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే కరణం రమానంద్‌ను కొనసాగించడమే ఉత్తమమని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply