ప్రెస్‌క్లబ్బా.. వ్యాపార కేంద్రమా?

  • ప్రెస్‌క్లబ్ భవనం వినియోగంపై విచారణ జరపాలి
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవహారంపై చర్యలు తీసుకోవాలి
  • జిల్లా కలెక్టర్‌కు ఏబీవీపీ వినతిపత్రం

సంగారెడ్డి ప్రతినిధి, (ఆంధ్రప్రభ): సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన ప్రెస్‌క్లబ్ భవనం వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) డిమాండ్ చేసింది. భవనం వినియోగం, అద్దె ఆదాయానికి సంబంధించి వస్తున్న ఆరోపణలను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు ఏబీవీపీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బోడ లక్ష్మణ్ మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా ఒకే జర్నలిస్టు సంఘం ప్రెస్‌క్లబ్ నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రెస్‌క్లబ్ భవనాన్ని ఇతర కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ ఆదాయం పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల కారణంగా జిల్లాలోని పలువురు జర్నలిస్టులు, వివిధ వర్గాల ప్రతినిధులు ప్రెస్‌క్లబ్‌ను వినియోగించుకునే అవకాశం పొందలేకపోతున్నారని ఆయన తెలిపారు.

ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం వినియోగంపై గతంలోనూ పలు జర్నలిస్టు సంఘాలు జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినట్లు లక్ష్మణ్ పేర్కొన్నారు. అయితే, ఆయా ఫిర్యాదులపై ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించలేదని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రెస్‌క్లబ్ నిర్వహణ, భవనం వినియోగం, అద్దె రూపంలో ఆదాయం సమకూరిందా? సమకూరితే ఆ నిధుల నిర్వహణ ఎలా జరిగింది? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు.

జిల్లాలో ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు, వివిధ సామాజిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు తరచూ మీడియా సమావేశాలు నిర్వహించాల్సి వస్తోందని తెలిపారు. అయితే ప్రెస్‌క్లబ్ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల ఆయా వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం లేదా జిల్లా యంత్రాంగం పర్యవేక్షణలో ఆధునిక సౌకర్యాలతో కూడిన జిల్లా ప్రెస్‌క్లబ్‌ను నిర్వహించాలని ఏబీవీపీ కోరింది. ముందస్తు అనుమతి విధానాన్ని అమలు చేసి, నిబంధనలకు అనుగుణంగా అన్ని అర్హత కలిగిన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

అలాగే, గత 20 ఏళ్లుగా ప్రెస్‌క్లబ్ భవనాన్ని అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం సమకూరిందనే ఆరోపణలపై విచారణ జరపాలని కోరింది. ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు విచారణలో నిర్ధారణ అయితే, సంబంధిత రికార్డులను పరిశీలించి నిబంధనల ప్రకారం తదుపరి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ప్రెస్‌క్లబ్ భవనం వినియోగం, నిర్వహణకు సంబంధించిన అంశాలను పారదర్శకంగా పరిశీలించి, వాస్తవాలను వెల్లడించాలని ఏబీవీపీ ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌ను కోరారు. తాము సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.