Indrakeeladri | కనకదుర్గమ్మకి కాసుల వర్షం..

  • అమ్మవారికి రూ.3.39 కోట్ల హుండీ ఆదాయం
  • 568 గ్రాముల బంగారం.. 3.330 కిలోల వెండి కానుకలు..
  • రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.21.22 లక్షలు
  • 29 దేశాల విదేశీ కరెన్సీ అమ్మవారికి బహుమానం..

ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారికి భక్తులు కానుకలు వర్షం కురిపిస్తున్నారు. జూన్ 20 నుంచి జూలై 6 వరకు 16 రోజుల హుండీల లెక్కింపులో మొత్తం రూ.3,39,53,599 నగదు ఆదాయం నమోదైంది. భక్తులు నగదుతో పాటు బంగారం, వెండి, విదేశీ కరెన్సీని కూడా భారీగా సమర్పించారు.

శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం మహా మండపం ఆరవ అంతస్తులు వహించిన హుండీల లెక్కింపులో 16 రోజుల వ్యవధిలో భక్తులు నగదు రూ.3,23,81,599, నాణేలు రూ.15,72,000 ఉండగా, మొత్తం నగదు రూ.3,39,53,599గా నమోదైంది. హుండీలలో 568 గ్రాముల బంగారం, 3 కిలోల 330 గ్రాముల వెండి కూడా లభించాయి. ఈ కాలంలో రోజుకు సగటు హుండీ ఆదాయం రూ.21,22,099.94గా నమోదైనట్లు దేవస్థానం వెల్లడించింది.

విదేశాల్లో నివసించే భక్తులు కూడా అమ్మవారిపై తమ భక్తిని చాటుతూ అమెరికా డాలర్లు, ఆస్ట్రేలియా డాలర్లు, యూఏఈ దిర్హామ్‌లు, యూరోలు, ఇంగ్లాండ్ పౌండ్లు, సౌదీ రియాల్స్, కెనడా డాలర్లు, మలేషియా రింగిట్, సింగపూర్ డాలర్లు తదితరంగా 29 దేశాల విదేశీ కరెన్సీని హుండీలలో సమర్పించారు. అదేవిధంగా, చెలామణి నుంచి ఉపసంహరించబడిన రూ.2,000 విలువైన 5 నోట్లు, రూ.1,000 విలువైన 9 నోట్లు, రూ.500 విలువైన 74 పాత నోట్లు కూడా హుండీలలో లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపును దుర్గగుడి చైర్మన్ బొర్రా గాంధీ, పాలకమండ సభ్యులు ఆలయ అధికారులు ఎస్పీఎఫ్ స్థానిక పోలీసులు, సేవకుల ఆధ్వర్యంలో నిర్వహించారు.