Meeting | సమ్మె విరమణకు ససేమిరా..!

Meeting | సమ్మె విరమణకు ససేమిరా..!

  • మూడు ప్రధాన డిమాండ్లపై జేఏసీ నేతల పట్టు

Meeting | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె అంశంపై ప్రభుత్వ పిలుపు మేరకు ఐఏఎస్ అధికారుల బృందంతో జేఏసీ నాయకులు కీలక భేటీ నిర్వహించారు. రెండు గంటలకు పైగా చర్చలు సాగుతున్నప్పటికీ ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.

చర్చల ప్రారంభంలోనే జేఏసీ నాయకులు మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వ ముందుంచినట్లు సమాచారం. వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారుల బృందానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. కీలక సమస్యలపై స్పష్టత వచ్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని జేఏసీ నేతలు తేల్చిచెప్పినట్లు సమాచారం.

ఇక ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని జేఏసీ మరింత పట్టుబట్టింది. ప్రభుత్వం దీనిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని వారు డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

మరోవైపు సమ్మె కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలని ఐఏఎస్ అధికారుల బృందం జేఏసీ నేతలను కోరింది. కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

అయితే కేవలం మాటల హామీలతో సరిపెట్టబోమని, తమ డిమాండ్ల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే సమ్మె విరమణపై ఆలోచిస్తామని జేఏసీ నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం.