Medaram | మేడారం జాతరకు జాతీయ హోదా సాధ్యంకాదు
దేశంలో ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదు
ఓరుగల్లుకు పూర్వ వైభవం తీసుకోస్తాం
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
Medaram | ఆంధ్రప్రభ సిటీబ్యూరో, వరంగల్ : ప్రతి రెండేళ్లకోకసారి జరిగే మేడారం గిరిజన జాతరకు జాతీయ హోదా ఇవ్వడం సాధ్యం కాదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) తెగేసి చెప్పారు. దేశంలోని ఏ ఉత్సవాలకు జాతీయ హోదా లేదని గుర్తు చేశారు. కాకతీయ సామ్రాజ్య రాజధానిగా విలసిల్లిన ఓరుగల్లుకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఓరుగల్లులో ఒక రోజు పర్యటన కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విచ్చేశారు.
హైదరాబాద్ నుండి వందేభారత్ ట్రైన్ లో వరంగల్ కు చేరుకున్నారు. రేల్వే స్టేషన్ క్యాంటీన్లో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్ (Warangal) రైల్వే స్టేషన్ లో చేపట్టిన అభివృద్ధి పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నగరంలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ… మేడారం జాతరపై కీలక వ్యాఖ్యలు చేశారు.
మేడారం (Medaram) జాతర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఓరుగల్లు అభివృద్ధికై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుందని స్పష్టం చేశారు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప, వేయిస్థంబాల గుడికి పూర్వ వైభవం తీసుకు వచ్చామన్నారు. భక్తుల అవసరాలకు తగట్టు వసతులు సమకూరుస్తామని అభయమిచ్చారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ సహకారం కోసం లేఖ రాస్తే ఇప్పటి వరకు ఎటువంటి స్పందన రాలేదన్నారు.

