BRS | యూకే లోనూ బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలు కేటిఆర్

ఇంగ్లాండ్ | భారత రాష్ట్ర సమితి 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ సంబరాలలో భాగంగా యునైటెడ్ కింగ్డమ్ యూకే లోను పార్టీ రజతోత్సవ సంబరాలను నిర్వహించనున్నట్లు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ,అక్కడి పార్టీ ఎన్.ఆర్.ఐ నేతలతో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ విభాగం నుంచి వచ్చిన ఓ విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. పార్టీ రజతోత్సవ వేడుకలను ఏడాది పాటు ఘనంగా నిర్వహించాలన్న పార్టీ అధినేత కేసీఆర్ సూచన మేరకు ఇంగ్లాండ్ లో కూడా నిర్వహించాలని ఎన్.ఆర్.ఐ నేతలు కేటీఆర్ ను కోరారు.

ప్రాంతాలకు అతీతంగా యూకేలో ఉన్న తెలుగు వాళ్లంతా ఈ సంబరాల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉన్నారని తెలిపారు. దీంతో పార్టీ రజతోత్సవ సంబరాలను యూకే లో నిర్వహించడానికి కేటీఆర్ నిర్ణయించారు.

ఇప్పటికే తెలంగాణలో వరంగల్ బహిరంగ సభ ద్వారా రజతోత్సవ సంబరాలను ప్రారంభించినట్లు తెలిపిన కేటీఆర్, ఏడాది కాలం పాటు వివిధ రూపాలలో, దేశ విదేశాలలో ఈ సంబరాలను కొనసాగించనున్నట్లు తెలిపారు. అందులో భాగంగా అమెరికాలోని డల్లాస్ నగరంలో జూన్ 1వ తేదీన సిల్వర్ జూబ్లీ సమావేశాలను నిర్వహిస్తున్నట్లు తెలిపిన కేటీఆర్, ఇదే క్రమంలో యూకే లోను సంబరాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ సంబరాలకు స్వయంగా తాను హాజరు కావడంతో పాటు, పార్టీ సీనియర్ నేతలు, తెలంగాణ కళాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు. మలిదశ ఉద్యమకాలంలో తెలంగాణ వాదానికి గొప్ప ప్రతీకలుగా నిలిచారని బీఆర్ఎస్ యూకే ఎన్.ఆర్.ఐ విభాగం కార్యవర్గాన్ని కేటీఆర్ ప్రశంసించారు.

బీఆర్ఎస్ హయాంలో గత పదేండ్లలో జరిగిన తెలంగాణ అభివృద్దికి బ్రాండ్ అంబాసిడర్ లు గా పనిచేశారని మెచ్చుకున్నారు. ఉద్యమనేత కేసీఆర్ మార్గనిర్దేశనంలో దేశానికే రోల్ మోడల్ గా మారిన తెలంగాణను ప్రపంచ వేదికలపై గొప్పగా చూపించడంలో బీఆర్ఎస్ ఎన్.ఆర్.ఐ విభాగం విజయవంతం అయిందన్నారు. ఒకటిన్నర సంవంత్సర కాలంగా తెలంగాణలో కాంగ్రెస్ చేస్తున్న దోపిడి, అరాచకాలు,ప్రజలపై జరుపుతున్న వేధింపులను బాగా ఎండగడుతున్నారని యూకే ఎన్.ఆర్.ఐ నేతలను కేటీఆర్ మెచ్చుకున్నారు.

ఇంగ్లాండ్ లో ఉన్న సోషల్ మీడియా వారియర్స్ పై కూడా అక్రమ కేసులు పెట్టినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా రేవంత్ ప్రభుత్వ దాష్టికాలను ప్రశ్నిస్తున్నారని ప్రశంసించారు. తెలంగాణలో ఏ మూలకు వెళ్లినా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుందన్న కేటీఆర్, ఖండతారాల్లో ఎక్కడ ఉన్నా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న మోసాలను లేవనెత్తాలని ఎన్.ఆర్.ఐలకు పిలుపునిచ్చారు. గత ఒకటిన్నర సంవత్సరకాలంగా చేసిన కార్యక్రమాలను పార్టీ ఎన్.ఆర్.ఐ విభాగం కేటీఆర్ కు వివరించింది. రజతోత్సవ సంబరాల నిర్వహణ ప్రణాళికలను కూడా ఆయనతో పంచుకుంది.

Leave a Reply