Mantralayam Political Tension |మళ్లీ రగిలిన రాజకీయ వైరం

Mantralayam Political Tension | మళ్లీ రగిలిన రాజకీయ వైరం

  • వైసీపీ–టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత
  • వాహనాల దహనం.. వందలాది కార్యకర్తల సమీకరణ..
  • గ్రామాలన్నీ పోలీసు వలయంలోకి…
  • రాంపురం–బసాపురం–మాధవరం కేంద్రంగా హైటెన్షన్ వాతావరణం

కర్నూల్ బ్యూరో, మంత్రాలయం, ఆంధ్రప్రభ:

ఒక బాణసంచా ఘటన… రెండు రాజకీయ శిబిరాలు… వందలాది మంది కార్యకర్తల సమీకరణ… తగలబడిన వాహనాలు… గ్రామాలన్నీ పోలీసు వలయంలోకి..! ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గంలో గురువారం రాజకీయ ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. వైసీపీ–టీడీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలు, వాహనాల దహనం, ప్రతీకార యత్నాల మధ్య రాంపురం, బసాపురం, మాధవరం, కోసిగి ప్రాంతాలు హైటెన్షన్ వాతావరణాన్ని తలపించాయి. రాయలసీమలో ఒకప్పుడు కనిపించిన వర్గపోరాటాల దృశ్యాలను గుర్తు చేస్తూ రాజకీయ ప్రత్యర్థిత్వం మరోసారి తెరపైకి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పే ప్రమాదాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు భారీగా బలగాలను మోహరించి ఇరు వర్గాలను అడ్డుకోవడంతో పెద్ద ఘర్షణ తప్పింది. అయినప్పటికీ గ్రామాల్లో ఉద్రిక్తత కొనసాగుతుండగా, రాజకీయ సెగలు మాత్రం ఇంకా చల్లారలేదు.

జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్గం గురువారం రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలతో మంత్రాలయం, కోసిగి మండలాల్లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాంపురం, బసాపురం, మాధవరం గ్రామాల పరిసర ప్రాంతాలు రాజకీయంగా అట్టుడికిపోగా, పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మధ్యాహ్నం వరకు సాధారణంగా కనిపించిన పరిస్థితులు, సాయంత్రానికి హైటెన్షన్ వాతావరణంగా మారిపోయాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా పోలీసు వాహనాలు, బారికేడ్లు, గుంపులుగా నిలిచిన కార్యకర్తలు కనిపించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఘటనకు బీజం ఎలా పడింది..?

వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “చంద్రబాబు వెన్నుపోటు రెండేళ్లు” కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రాలయం మండలం నుంచి కోసిగి మండలానికి నాయకులు, కార్యకర్తలు వెళ్తున్న సమయంలో వివాదం ప్రారంభమైనట్లు తెలుస్తోంది. టీడీపీ వర్గాల కథనం ప్రకారం, వైసీపీకి చెందిన ఓ కార్యకర్త మద్యం మత్తులో మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నివాసం వద్దకు బైక్‌పై వెళ్లి బాణసంచా పేల్చినట్లు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో టీడీపీ శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

దాడులు.. వాహనాల దహనం

అనంతరం కోసిగిలో కార్యక్రమం ముగించుకుని తిరిగి వెళ్తున్న వైసీపీ నాయకులు, కార్యకర్తల వాహనాలపై దాడులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఒక కారు, ఒక స్కూటర్‌కు నిప్పంటించడంతో అవి పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎమ్మిగనూరు నుంచి అగ్నిమాపక సిబ్బంది చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చినప్పటికీ అప్పటికే వాహనాలు పూర్తిగా కాలిపోయాయి. దాడుల సమయంలో కొందరు కార్యకర్తలు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది.

మాధవరం వైపు భారీగా కదిలిన వైసీపీ శ్రేణులు..

వాహనాల దహనం విషయం తెలుసుకున్న వెంటనే వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున సమీకరమయ్యాయి. ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి అనుచరులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రాంపురం, బసాపురం తదితర గ్రామాల నుంచి వాహనాల్లో మాధవరం వైపు కదిలారు. మాధవరం గ్రామంలో ఉన్న టీడీపీ ఇన్‌చార్జి రాఘవేంద్రరెడ్డి నివాసం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది.

ఊరి శివారులోనే అడ్డుకున్న పోలీసులు

పరిస్థితి అదుపు తప్పే అవకాశాన్ని ముందుగానే గుర్తించిన పోలీసులు రాంపురం గ్రామ శివారులోనే వైసీపీ శ్రేణులను అడ్డుకున్నారు. బసాపురం వద్ద కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
మరోవైపు మాధవరం గ్రామంలో రాఘవేంద్రరెడ్డి నివాసం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి సుమారు 1000 మంది టిడిపి కార్యకర్తలు, నేతలు రాంపురం వైపు కదిలెందుకు సిద్ధమయ్యారు. దీంతో విషయం తెలుసుకున్న మంత్రాలయం, కోసిగి, మాధవరం పోలీస్ సిబ్బందితో పాటు ఎమ్మిగనూరు డీఎస్పీ ఆధ్వర్యంలో అదనపు బలగాలు రంగంలోకి దిగాయి.

గ్రామాల్లో భయాందోళన

రాంపురం, బసాపురం, మాధవరం, కోసిగి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. వందలాది మంది కార్యకర్తలు గుమిగూడటం, వాహనాల రాకపోకలు, పోలీసు బందోబస్తుతో గ్రామాల్లో అసాధారణ పరిస్థితులు కనిపించాయి.
స్థానికులు ముందస్తు జాగ్రత్తగా ఇళ్లకే పరిమితమవుతుండగా, కొంతమంది వ్యాపారులు దుకాణాలను ముందుగానే మూసివేసినట్లు సమాచారం.

మళ్లీ ఫ్యాక్షన్ రాజకీయాల చర్చ

మంత్రాలయం నియోజకవర్గంలో ఒకప్పుడు వర్గ రాజకీయాలు, ఆధిపత్య పోరాటాలు తీవ్రంగా ఉండేవి. గత కొన్నేళ్లుగా పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నప్పటికీ తాజా ఘటనతో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలపై చర్చ మొదలైంది.గ్రామ స్థాయిలో రాజకీయ ప్రత్యర్థిత్వం పెరగడం, కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు ఎక్కువ కావడం, చిన్న సంఘటనలు పెద్ద ఘర్షణలకు దారితీసే పరిస్థితులు ఏర్పడుతున్నాయని స్థానిక రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

పోలీసుల అప్రమత్తత

ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నప్పటికీ ఉద్రిక్తత పూర్తిగా చల్లారలేదని తెలుస్తోంది. ఇరు వర్గాల కదలికలపై పోలీసులు నిఘా ఉంచారు. రాత్రి వేళల్లో కూడా అదనపు బందోబస్తు కొనసాగించే అవకాశం ఉందని సమాచారం.