మాది రైతు సంక్షేమ ప్రభుత్వమే
- మామిడి రైతులకు రూ. 4 సబ్సిడీ
- ఉనికి కోసమే వైకాపా విమర్శలు
- చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : రైతుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, మామిడి రైతులను ఆదుకునేందుకు రూ.4 సబ్సిడీ ప్రకటించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని చిత్తూరు పార్లమెంటు సభ్యుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు దగ్గుమళ్ల ప్రసాదరావు అన్నారు. సోమవారం చిత్తూరులోని తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మామిడి రైతుల సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో పరిగణించిందని, గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు తక్షణ ఉపశమనంగా రూ. 4 సబ్సిడీ ప్రకటించడం ద్వారా కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతిగా నిలిచిందన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని, రైతు సంక్షేమానికి ఆయన కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు.
పని చేస్తున్న ప్రభుత్వంపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల్లో వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకనే వైకాపా నాయకులు నిరసనల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. మామిడి రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 281 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా లేఖ రాశారని గుర్తు చేశారు.
దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ సానుకూలంగా స్పందించి, తోతాపురి మామిడి ధరలు పడిపోవడానికి గల కారణాలను అధ్యయనం చేసి రైతుల ఆదాయాన్ని పెంచే మార్గాలను సూచించేందుకు భారత వ్యవసాయ పరిశోధనా మండలి నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసిందన్నారు.
మామిడి రైతులను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన ఘనత గత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ఆయన విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి ప్రత్యేక పథకాలను సాధిస్తూ, రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు అహర్నిశలు కృషి చేస్తోందన్నారు. విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి అశోక్ కుమార్, ఆంధ్రప్రదేశ్ మాల ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
