రైతుల ఆవేదనపై కీలక హెచ్చరిక..

  • ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించిన మాజీ మంత్రి హరీశ్‌రావు
  • కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమిషన్ మోడ్
  • రేవంత్‌రెడ్డీ.. గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులు బంజేసి..
  • కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచు
  • క్వింటాల్‌కు 5కిలోల తరుగుతో రైతుల నిలువు దోపిడీ
  • అయినా మంత్రులకు, అధికారులకు పట్టింపు లేదు
  • 45 రోజుల్లో రైతుబంధు ఇస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం..
  • 63 రోజులైనా ఆ మాట నిలబెట్టుకోలేదు
  • ఎన్సాన్‌పల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఎమ్మెల్యే హరీశ్ రావు ఫైర్

ఉమ్మ‌డి మెద‌క్ బ్యూరో, ఆంధ్ర‌ప్ర‌భ‌ : రెండు రోజుల్లో వడ్ల కొనుగోళ్లు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతులతో కలెక్టరేట్‌ను ముట్టడిస్తాన‌ని కాంగ్రెస్ ప్రభుత్వానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ‌ర్ హ‌రీశ్ రావు డెడ్‌లైన్ విధించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్‌పల్లి గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు సోమ‌వారం సందర్శించారు. కల్లాల్లో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్న రైతుల కష్టాలను ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వడ్ల కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదపి, కమిషన్ మోడ్ అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి గారడీ మాటలు, ఢిల్లీ ట్రిప్పులు ఆపేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాల‌ని హ‌రీశ్ హిత‌వు ప‌లికారు. క్వింటాల్‌కు 5కిలోల తరుగుతో రైతులు నిలువునా మోసపోతున్నా మంత్రులకు, అధికారులకు పట్టింపు లేదని విమ‌ర్శించారు. 45 రోజుల్లో పూర్తి రైతుబంధు ఇస్తానని మార్చి 22న సిద్దిపేట గడ్డపై ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్‌.. 63 రోజులైనా ఆ మాట నిలబెట్టుకోలేదని అన్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల లక్షలాది మంది రైతులు హరిగోస పడుతున్నారని, అయిన ఈ ప్రభుత్వానికి రైతులంటే పట్టింపు లేదు, లెక్కలేదని పేర్కొన్నారు. యూరియా సరఫరా, కరెంటు, రైతుబంధు ఇవ్వడంలో ఫెయిల్ అయిన ప్రభుత్వం, ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను కొనడంలో కూడా పూర్తిగా విఫలమైందని చెప్పారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. ఇలా ఏ సీఎం ఉన్నా కూడా రైతులకు ఇంత బాధ, కష్టం ఎన్నడూ రాలేదని గుర్తు చేశారు.

మంత్రి ఉత్త‌మ్ మాట‌లు ఉత్త‌యేనా?

రాష్ట్రంలో కోటి 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంటే.. నిన్నటి దాకా 90 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొంటామని చెప్పిన మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇవాళ 70 లక్షల టన్నులే కొంటామంటున్నారని, అంటే మిగతా 70 లక్షల టన్నులు రైతులు దళారులకు అమ్ముకుని నష్టపోవాలా అని ప్ర‌శ్నించారు. వడ్లు కొనడం చేతగాక కేంద్రం మీద నెపం నెడుతున్నారని, కేంద్రం కొనకపోతే ఆనాడు కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్రం మెడలు వంచారని గుర్తు తెచ్చుకోవాల‌ని సూచించారు. కేంద్రం కొనకున్నా, రైతులకు నష్టం కలగకుండా కేసీఆర్ గారే కొనుగోలు చేశారు. మీకు చేతనైతే ఢిల్లీ పోయి కొట్లాడండి కానీ రైతులను నట్టేట ముంచకండి.

కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీస్తే తోలు తీస్తానని సీఎం రేవంత్‌రెడ్డి, కఠిన చర్యలు తీసుకుంటానని మంత్రి ఉత్తమ్ ఏసీ రూముల్లో కూర్చుని డైలాగులు కొడుతున్నారని, నా నియోజకవర్గంలోని నంగనూరు, ఖానాపూర్, ఖాతా, వెంకటాపూర్, నర్మెట, పాలమాకుల, సిద్దిపేట అర్బన్, ఎన్సాన్ పల్లి, మిట్టపల్లి, రావురుకుల‌, రాఘవాపూర్, మల్లారం, సికింద్లాపూర్ తదితర గ్రామాల నుంచి రైతులు నాకు ఉదయం నుంచి ఫోన్లు చేశార‌ని, మిల్లుల్లో బస్తాకు 43 కిలోలు పెడితేనే దించుకుంటామని మిల్లర్లు రైతులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనివల్ల ఎకరాకు 150 కిలోల చొప్పున రైతులు నష్టపోతున్నారని, ఈ విషయాన్ని డీఎస్వో దృష్టికి తీసుకెళ్తే మీరు మిల్లర్లతోనే మాట్లాడుకోండి అని బాధ్యతారాహిత్యంగా సమాధానం ఇస్తున్నారని చెప్పారు.

రోహిణీ కార్తె వ‌చ్చినా క‌ల్లాల్లోనే వ‌డ్లు!

రోహిణీ కార్తె వచ్చినా కొనుగోళ్లు కాక వడ్లు కల్లాల్లోనే ముగ్గుతున్నాయని, మూడో వంతు మాత్రమే కొన్నారని, ఇంకా రెండొంతుల వడ్లు ఆరుబయటే ఉన్నాయని తెలిపారు. వర్షాలకు వ‌ల్ల వడ్ల కుప్పల మీదనే మెదక్ జిల్లా కొల్చారంలో ఒక రైతు చనిపోయాడని, ఇన్ని స‌మ‌స్య‌లున్నా.. ఏ ఒక్క మంత్రి కొనుగోలు కేంద్రాలకు రావడం లేదని, రైతులు మిట్టపల్లి, నంగనూరు, చిన్నకోడూరులో రాస్తారోకోలు చేస్తున్నా ఈ ప్రభుత్వానికి కనికరం లేదని హ‌రీశ్‌రావు మండిప‌డ్డారు.

కల్లాల్లో ప్రాణాలు విడుస్తున్న రైతులు

సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌లో కూర్చుని మిషన్ మోడ్ అని పేపర్ టైగర్ లా డైలాగులు కొడుతున్నాడని, మీరు వడ్లు కొనే పద్ధతి చూస్తే నత్తలు కూడా సిగ్గుపడతాయని తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 10-12 మంది రైతులు క‌ల్లాల్లోనే ప్రాణాలు కోల్పోయార‌ని వివ‌రించారు. నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్‌లో రైతుల కష్టాల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమ‌ని అన్నారు. కొమురెల్లి మల్లన్న, యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి, ఏడుపాయల అమ్మవారు, మెదక్ చర్చి.. ఇలా కనబడ్డ దేవుళ్లందరి మీద ఒట్లు పెట్టి రుణమాఫీ చేయకుండా మాట తప్పిన సీఎం రేవంత్ ఒక్క‌రేన‌ని అన్నారు. ఎన్సాన్‌పల్లి కేంద్రంలో నెలన్నరలో కేవలం ఆరు లారీలు మాత్రమే వచ్చాయని, వానలకు వడ్లు తడిసి, కింద సీసీ లేక మట్టిలో కలిసిపోయి చెదలు పడుతున్నాయన్నారు. సీఎం ఇప్పటికే 60 సార్లు ఢిల్లీకి ట్రిప్పులు కొట్టిండు, నీ ఢిల్లీ ట్రిప్పులతో మాకొచ్చిందేమీ లేదని, ఢిల్లీ ట్రిప్పులు బంజేసి, కొనుగోలు కేంద్రాలకు లారీల ట్రిప్పులు పెంచాల‌ని సూచించారు.

గారడీ మాటలు బంజేసి, గన్నీ బ్యాగులు పంపించు

ఎన్సాన్ పల్లిలో కనకయ్య అనే రైతు కనీసం సంచులు కూడా లేవని ఆవేదన చెందాడ‌ని, నీ గారడీ మాటలు బంద్ చేసి, తక్షణమే గన్నీ బ్యాగులు పంపించాల‌ని అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతూ, మమ్మల్ని వ్యక్తిగతంగా తిడుతున్నారని, మీరు ఎన్ని తిట్టినా పడతాం, కానీ రైతులకు కాంటాలు పెట్టండి, లారీలు పంపండి అని హిత‌వు ప‌లికారు. నాగలక్ష్మి అనే మహిళా రైతు మక్కలు అమ్మి రెండు నెలలైనా ఇంతవరకు ఒక్క రూపాయి రాలేదన్నారు. వెంటనే మక్కలు, సన్ ఫ్లవర్, జొన్నలు అమ్మిన రైతులకు ఆ డబ్బులు ఖాతాల్లో జమ చేయాలని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా నేనే వేలాది మంది రైతులను వెంటబెట్టుకుని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి కలెక్టరేట్ ను దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.

Leave a Reply