mancherial | దారుణ హత్య

నిందితుల కోసం పోలీసుల గాలింపు

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అండాళమ్మ కాలనీ జలగుట్ట ప్రాంతంలో గురువారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం ప్రాంతానికి చెందిన లాక్‌పతి అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విచక్షణారహితంగా పొడిచి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.

స్థానికులు రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని పరిశీలించి ఆధారాలు సేకరించారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. వ్యక్తిగత విభేదాలా, పాత కక్షలా, లేక మరేదైనా కారణమా అనే అంశాలపై విచారణ కొనసాగుతోంది. నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ ఘటనతో జలగుట్ట ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.