అమరుల త్యాగఫలమే స్వాతంత్ర్యం
మక్తల్ (ఆంధ్రప్రభ): అమరుల త్యాగ ఫలితమే స్వాతంత్ర్యమని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. సంక్షేమ ఫలాలు దేశంలోని పేదలందరికీ అందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లవుతుందని పేర్కొన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ వాకిటి మానస హన్మంతు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జవహర్లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, వారి వీరోచిత పోరాటం వల్లే నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నామని పేర్కొన్నారు.
సంక్షేమ ఫలాలు పేదలందరికీ అందాలి
అమరవీరుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని మంత్రి వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఇప్పటికీ సొంత గూడు లేని పేదలు ఉన్నారని, వారందరికీ సొంతింటి కలను నిజం చేయడమే లక్ష్యంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5 లక్షలు అందిస్తోందన్నారు. అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మంత్రి కోరారు. కార్యక్రమంలో కమిషనర్ రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జి. రాధాలక్ష్మారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
