ప్రతి ఇంటికి ఇంకుడు గుంత.. ప్రతి పొలానికి పంట కుంట నిర్మించాలి
జలసిరి కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఎంపీడీవో పావని పిలుపు
ఊట్కూర్, ఆంధ్రప్రభ: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న జలసిరి కార్యక్రమం ద్వారా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడమే ప్రధాన లక్ష్యమని ఊట్కూర్ ఎంపీడీవో పావని అన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత, ప్రతి పొలంలో పంట కుంట నిర్మించుకొని నీటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని ఆమె పిలుపునిచ్చారు.
మంగళవారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ఎం. రేణుక భరత్ అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభకు ఎంపీడీవో పావని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వర్షపు నీటిని వృథా కాకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు చేపట్టడం వల్ల భూగర్భ జలాలు పెరిగి భవిష్యత్ తరాలకు తాగునీరు, సాగునీటి సమస్యలు తగ్గుతాయని అన్నారు.
జలసిరి కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని, ప్రతి కుటుంబం స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవడంతో పాటు రైతులు తమ వ్యవసాయ భూముల్లో పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. గ్రామపంచాయతీ, సంబంధిత శాఖల అధికారులు ప్రజలకు అవసరమైన సాంకేతిక సూచనలు అందిస్తారని తెలిపారు.
ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు తప్పనిసరిగా ఫార్మ్ పాండ్లు (పంట కుంటలు) నిర్మించుకునేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు.
ఊట్కూర్ సర్పంచ్ ఎం. రేణుక భరత్, మల్లేపల్లి సర్పంచ్ కతలప్ప, పెద్ద జట్రం సర్పంచ్ వాకిటి వెంకటేష్, బిజ్వార్ సర్పంచ్ అంజయ్య, చిన్నపొర్ల సర్పంచ్ గాండ్ల నికిత, అమీన్పూర్ సర్పంచ్ నాగేష్‌తో పాటు పలువురు సర్పంచ్‌లు మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి జల సంరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు.
గ్రామంలోని ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, ప్రతి రైతు పొలంలో పంట కుంటల నిర్మాణానికి గ్రామపంచాయతీ పూర్తిస్థాయిలో సహకరిస్తుందని తెలిపారు. ప్రజలందరూ జలసిరి కార్యక్రమంలో చురుకుగా పాల్గొని లక్ష్యాలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీవో బాలాజీ, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
