Mahabubnagar Politics | ఉమ్మడి పాలమూరుపై ఫోకస్

రెండు నెలల్లో మూడుసార్లు రేవంత్ పర్యటనలు
అభివృద్ధి, ప్రాజెక్టులపై దృష్టి..
వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే వ్యూహరచన
సొంత జిల్లాపై పట్టు నిలపడానికి ప్రయత్నం
వచ్చే అసెంబ్లీలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానాలు కీలకం

Mahabubnagar Politics | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. తన సొంత ప్రాంతమైన పాలమూరు గడ్డపై పార్టీ బలాన్ని మరింత పెంచడంతో పాటు, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో నమ్మకం పెంచుకునే వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల రెండు నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మూడుసార్లు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ పర్యటనలను కాంగ్రెస్ పార్టీ ముందస్తు కార్యాచరణలో భాగంగా భావిస్తోంది. రేవంత్‌రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లి ఆయన స్వగ్రామం. ఈ నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రాజకీయంగా పట్టు కొనసాగించేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రాజెక్టులపై ప్రత్యేక సమీక్షలు

గత జూన్‌లో పాలమూరు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులతో కలిసి సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ముఖ్యంగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి, అవసరమైన నిధుల సమీకరణపై చర్చించారు. అనంతరం జడ్చర్లలో జరిగిన బహిరంగ సభలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాంతం తనకు ఎంతో ఇచ్చిందని, జిల్లాకు రుణం తీర్చుకునేలా అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తానని ప్రకటించారు.

అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు

ఇటీవల ఉరుకొండ, మిడ్జిల్ ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం.. పాలమూరు ప్రాంత అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ, కొత్తకోట ప్రభుత్వ పాఠశాల ప్రారంభోత్సవం, దివిటిపల్లిలో అమర్‌రాజా కంపెనీ కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వివిధ శాఖల మంత్రులు జిల్లాలో పర్యటిస్తూ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

ఎన్నికల వ్యూహంలో భాగంగానే?

ప్రస్తుత అసెంబ్లీ గణాంకాల ప్రకారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆధిపత్యాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో పార్టీ ఇప్పటి నుంచే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు చేపడుతున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. రాబోయే నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) నేపథ్యంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ ప్రాంతంలో అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

పార్టీలోని అసంతృప్తులను సమన్వయం చేయడం, పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల ఆశావహులకు భరోసా కల్పించడం వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా, వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు, రాజకీయ సమీకరణాలను సమాంతరంగా నడిపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేక వ్యూహంతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది.