ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలి..

ప్రతి ఓటరు ఎస్ఐఆర్ ఫారం నింపి బీఎల్ వోలకు అందజేయాలి..
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష

పెద్దపల్లి జిల్లా ఓదెల, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నెలకొన్న సూపర్ ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులు అధిక నీరు అవసరమయ్యే వరి సాగుకు దూరంగా ఉండి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని పూర్తి చేసి బీఎల్వీలకు అందజేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో విస్తృతంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ కొలనూర్ గ్రామపంచాయతీలో జరుగుతున్న ఎస్ఐఆర్ ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. అనంతరం కొలనూర్ గ్రామంలో రైతులతో సమావేశమై పంట మార్పిడిపై అవగాహన కల్పించి పంట పొలాలను సందర్శించారు. అలాగే ఓదెల జడ్పీహెచ్ఎస్ పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి, అనంతరం నూతనంగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ, భారత ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ఫారాల సమర్పణ గడువును ఆగస్టు 3 వరకు పొడిగించిందన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ప్రతి ఓటరికి ఎన్యూమరేషన్ ఫారాలు అందించి పూర్తిగా నింపించి తిరిగి సేకరించాలని ఆదేశించారు. ఓటర్లు కూడా ఫారాలను త్వరితగతిన పూర్తి చేసి బీఎల్ వోలకు అందించాలని సూచించారు. వివిధ రాజకీయ పార్టీల బీఎల్ఎలు, వాలంటీర్లు, సామాజిక కార్యకర్తలు ఓటర్లకు ఫారాలు సక్రమంగా నింపడంలో సహకరించాలని కోరారు. రాష్ట్రంలో సూపర్ ఎల్నినో ప్రభావంతో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుండటంతో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గాయని, గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలాలు కూడా తగ్గుముఖం పట్టాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు అధిక నీటి అవసరమయ్యే వరి సాగును పూర్తిగా నివారించి చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల పంటలు, ఆయిల్ పామ్ వంటి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వం అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచిందని, వ్యవసాయ శాఖ అధికారులు నిరంతరం నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను రైతులు సద్వినియోగం చేసుకొని వారి సూచనల మేరకు సాగు ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు.

ఓదెల జడ్పీ హెచ్ఎస్ పాఠశాల, మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలను పరిశీలించిన సందర్భంగా ఉపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ పలు సూచనలు చేశారు. విద్యా సంవత్సరానికి రూపొందించిన ప్రణాళిక ప్రకారం సిలబస్ ను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి పాఠశాలలోని సదుపాయాల గురించి వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెరుగుపడేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని, ముఖ్యంగా వెనుకబడిన వి ద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి అదనపు బోధన అందించాలని ఆదేశించారు. ఓదెల మండల కేంద్రంలోని నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని పరిశీలించి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయని, మిగిలిన చిన్నచిన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, ఓదెల తహసీల్దార్ వనజ, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.