మాధవరం సభను విజయవంతం చేద్దాం..
మాధవరం సభను విజయవంతం చేద్దాం..
- చరిత్రలో నిలిచేలా నిర్వహిద్దాం..
- ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చిన కూటమి పాలన..
- పెండింగ్ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ..
- వేదికపైనే నుండే కీలక ప్రకటనలు..
- నియోజకవర్గ సమస్యలకు శాశ్వత పరిష్కారం..
- రైల్వే జోన్ రాష్ట్ర భవిష్యత్తును మార్చే చారిత్రాత్మక నిర్ణయం
తిరువూరు,ఆంధ్రప్రభ ; దాదాపు 28 నెలల తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తిరువూరు గడ్డపై అడుగుపెట్టబోతున్న ఈ సందర్భం నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేకమైనదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 23 నెలల కాలంలో తిరువూరు అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో కొత్త దిశగా అడుగులు వేసిందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. తిరువూరులోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఎన్నో సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న రహదారులు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందన్నారు.
గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల ద్వారా అనేక రోడ్ల నిర్మాణాలకు ఆమోదం లభించడం ప్రజలకు ప్రత్యక్ష లాభాన్ని అందించిందని చెప్పారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు సంబంధిత శాఖల మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. “ఏడేళ్లుగా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న కట్టలేరు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవల జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించి ప్రతిపాదనను ఆర్థిక శాఖకు పంపించారు.
త్వరలో జరిగే సభలో ఈ అంశంపై ముఖ్యమంత్రి నోటి ద్వారానే శుభవార్త వినబోతున్నాం” అని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. మాధవరంలో జరగనున్న ముఖ్యమంత్రి సభను చారిత్రాత్మక విజయంగా నిలబెట్టేందుకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. సభా ఏర్పాట్లు, ప్రజా రవాణా, భద్రత, ఇతర సౌకర్యాలపై ఇప్పటికే అధికారులతో సమీక్ష నిర్వహించామని, రానున్న రోజుల్లో పూర్తి స్థాయి ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పారు.
అభివృద్ధికి కీలక మలుపు రైల్వే జోన్..
విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర అభివృద్ధికి మైలురాయిగా అభివర్ణించారని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సహా రాష్ట్ర నాయకత్వానికి తిరువూరు ప్రజల తరఫున అభినందనలు తెలిపారు. రైల్వే అంటే కేవలం రవాణా కాదు.. అది ఒక ప్రాంత ఆర్థిక వ్యవస్థను మార్చే శక్తి. విజయవాడ ఎలా అభివృద్ధి చెందిందో, ఉత్తరాంధ్ర కూడా అదే దిశగా దూసుకెళ్లే రోజు దగ్గరపడింది. రాష్ట్ర అభివృద్ధి వేగాన్ని మరింత పెంచే నిర్ణయాలు వరుసగా అమలవుతున్నాయని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
