చిలకలూరిపేట సమీపంలో న్యాయవాది అనుమానాస్పద మృతి…

చిలకలూరిపేట, ఆంధ్రప్రభ : చిలకలూరిపేట మండల పరిధిలోని ఎడవల్లి గ్రామం సమీపంలో చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్ (39) మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. శుక్రవారం రోడ్డుపై ఆయన మృతదేహంపై స్కూటర్ పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, మృతుడు ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన న్యాయవాది శ్రీరామ్ హరిప్రసాద్‌గా గుర్తించారు. ఘటన స్థలంలో స్కూటర్ పడి ఉన్న తీరు, మృతదేహంపై గాయాల ఆధారంగా ఇది ప్రమాదమా లేదా ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడి చేశారా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సమాచారం అందిన వెంటనే ఎస్సై అనిల్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఇది ప్రమాదమా లేక హత్యా అన్న విషయంపై పూర్తి స్పష్టత వస్తుందని ఎస్సై తెలిపారు.

Leave a Reply