భారతరత్న ప్రకటించాలి

భారతరత్న ప్రకటించాలి
– జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీ రామారావు 103వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, కర్నూలు పార్లమెంట్ సభ్యుడు బస్తిపాడి నాగరాజు, జిల్లా టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఎన్టీఆర్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ముందుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహం, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. తర్వాత నాయకులు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్దకు చేరుకుని ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని కొనియాడారు. సినీ రంగంలో అగ్రనటుడిగా వెలుగొందిన ఆయన, రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకువచ్చారని గుర్తు చేశారు. రెండు రూపాయల కిలో బియ్యం, జనతా వస్త్రాలు, గృహ పథకాలు వంటి సంక్షేమ కార్యక్రమాలతో పేదల జీవితాల్లో మార్పు తీసుకువచ్చారని తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రాజకీయ, సామాజిక గుర్తింపు తీసుకువచ్చిన మహానేత ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. మహిళలకు సమాన హక్కులు, రిజర్వేషన్లపై ఆయన చూపిన దూరదృష్టి చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. ఎన్టీఆర్ సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతరత్న ప్రకటించాలని టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని నేతలు తెలిపారు. అలాగే నారా లోకేష్ మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల అమలుపై కట్టుబడి ఉన్నారని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించినందుకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా పార్టీ నాయకులు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
