పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్
నరసాపురం, ఆంధ్రప్రభ : పోలియో రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పిలుపునిచ్చారు.
నరసాపురం పట్టణంలోని కొప్పర్తి వేణుగోపాలరావు మున్సిపల్ కాంప్లెక్స్, మొగల్తూరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఆయన పాల్గొని చిన్నారులకు స్వయంగా పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులందరూ తమ పిల్లలను సమీపంలోని పోలియో కేంద్రాలకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా సహకరించాలని కోరారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజారోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి తోడ్పడాలని అన్నారు.
అనంతరం వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది సేవలను ఎమ్మెల్యే అభినందించారు. లక్ష్యానికి అనుగుణంగా ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డి, వైద్య సిబ్బంది, నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.
